TSPSC: గ్రూప్ వన్ ప్రిలిమ్స్ రద్దును సమర్థించిన హైకోర్టు

తెలంగాణలో గ్రూప్-వన్ ప్రిలిమ్స్ తిరిగి నిర్వహించాల్సిందేనని హైకోర్టు తేల్చిచెప్పింది. పరీక్ష రద్దు చేయాలన్న సింగిల్ జడ్జి తీర్పును సమర్థించిన డివిజన్ బెంచ్.. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అప్పీలును కొట్టేసింది. TSPSC మరింత జాగ్రత్తగా వ్యవహరించి ఉండాల్సిందని పేర్కొన్న ధర్మాసనం బయోమెట్రిక్ అమలు చేయకపోవడాన్ని తప్పుపట్టింది. ఒకసారి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత అందులోని నిబంధనలు అభ్యర్థులు సహా కమిషన్ కు కూడా వర్తిస్తాయని స్పష్టం చేసింది.
గ్రూప్ వన్ పరీక్ష విషయంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు హైకోర్టులో మరోసారి చుక్కెదురైంది. గ్రూప్ వన్ ప్రిలిమ్స్ రద్దు చేయాలన్న సింగిల్ జడ్జి తీర్పును డివిజన్ బెంచ్ సమర్థించింది. గతేడాది అక్టోబరు 16న జరిగిన గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్షను ప్రశ్నాపత్రం లీకేజీ కారణంగా రద్దు చేశారు. అదే పరీక్షను జూన్ 11న తిరిగి నిర్వహించినప్పుడు మొదటిసారి మాదిరిగా బయోమెట్రిక్ వివరాలు నమోదు చేయలేదంటూ ముగ్గురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ P.మాధవీదేవి జూన్ 11న జరిగిన గ్రూప్ వన్ ప్రిలిమ్స్‌ను రద్దు చేస్తూ, పరీక్ష తిరిగి నిర్వహించాలని తీర్పునిచ్చారు. సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ TSPSC వేసిన అప్పీలుపై జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలి, జస్టిస్ అనిల్‌కుమార్ జూకంటి ధర్మాసనం ఎదుట నిన్న, ఈ రోజు వాదనలు జరిగాయి.
503 గ్రూప్–1 ఉద్యోగాల భర్తీకి గతేడాది ఏప్రిల్‌లో టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. 3,80,081 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. గతేడాది అక్టోబర్ 16న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించిన కమిషన్ కేటగిరీల జాబితా తయారు చేసి 1:50 నిష్పత్తిలో మెయిన్‌కు అర్హుల జాబితాను ప్రకటించి పరీక్ష తేదీలు సైతం వెల్లడించింది. అయితే టీఎస్‌పీఎస్సీ కార్యాలయ పరిధిలో ఈ ఏడాది ఫిబ్రవరి నెలాఖరులో ప్రశ్నపత్రాల కుంభకోణం వెలుగు చూసింది. కమిషన్ సిబ్బంది కొందరు వివిధ పరీక్షల ప్రశ్నపత్రాలు బయటకు లీక్ చేశారనే ఆరోపణలతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా సిట్ ఏర్పాటు చేసింది. సిట్ దర్యాప్తులో అక్రమాలు వెలుగు చూడడంతో టీఎస్‌పీఎస్సీ వరుసగా వివిధ పరీక్షలను రద్దు చేసింది.
ఈ క్రమంలోనే గ్రూప్–1 ప్రిలిమినరీ పరీక్షను సైతం రద్దు చేసింది. గత జూన్ 11వ తేదీన తిరిగి ప్రిలిమినరీ పరీక్షలను నిర్వహించింది. రెండోసారి పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులందరినీ అనుమతించింది. రెండోసారి 2,33,248 మంది అభ్యర్థులు ప్రిలిమినరీ పరీక్ష రాశారు. అయితే రెండోసారి నిర్వహించిన పరీక్షలను కమిషన్ అత్యంత లోపభూయిష్టంగా నిర్వహించిందంటూ కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి కమిషన్ నిర్లక్ష్యాన్ని తప్పుబట్టారు. టీఎస్‌పీఎస్సీ నిర్లక్ష్య వైఖరి వల్లే గందరగోళం నెలకొందంటూ హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం సైతం స్పష్టం చేస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సమర్థిoచింది. దీంతో అభ్యర్థులు మరింత ఆవేదనకు గురయ్యారు. అయితే దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని టీఎస్‌పీఎస్సీ నిర్ణయించినట్లు తెలుస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com