TS: మార్చిలోగా స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి

TS: మార్చిలోగా స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి
X
తెలంగాణ కాంగ్రెస్ నేతలకు అధిష్టానం సూచన... ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని పిలుపు

మార్చిలోగా జీహెచ్‌ఎంసీ సహా అన్ని స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలకు.. ఆ పార్టీ అధిష్టానం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఆ ఎన్నికల్లో సత్తా చాటేలా ఇప్పటినుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించింది. రాష్ట్ర.. జిల్లా, మండల, గ్రామ స్థాయి నేతలను అప్రమత్తం చేయాలని ఆదేశించింది. పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌... తెలంగాణ కాంగ్రెస్‌ ముఖ్య నేతలతో ఢిల్లీలోని తన నివాసంలో సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, దామోదర రాజనర్సింహ, కొండ సురేఖ పాల్గొన్నారు. ఈ భేటీలో కీలక అంశాలపై చర్చలు జరిపారు. ప్రభుత్వ పాలన, పార్టీ పనితీరు, స్థానిక ఎన్నికలు, సంస్థాగత నిర్మాణం, రాహుల్‌గాంధీ సభ అంశాలపై సుమారు రెండున్నర గంటలపాటు సుదీర్ఘంగా చర్చించారు. బీసీ కుల గణనపై కూడా చర్చలు జరిపారు.

కార్యాచరణ సిద్ధం చేయండి

పార్టీ గుర్తులపై జరిగే ఎన్నికలను తొలుత నిర్వహించాలని... తర్వాత మిగతా ఎన్నికలను నిర్వహించేలా కార్యాచరణ తీసుకోవాలని అధిష్టానం నేతలకు సూచించింది. రాష్ట్రంలో పార్టీ అధికారంలో ఉన్న దృష్ట్యా స్థానిక సంస్థల ఎన్నికల్లో కనీసం 80 శాతం విజయాలు నమోదు చేయాలని స్పష్టం చేసింది. మంత్రులు ఎంతమాత్రం ఉదాసీనంగా ఉండొద్దని... జిల్లాల్లో విస్తృతంగా పర్యటించాలని తెలిపింది. ఈ ఎన్నికల్లో ఫలితాల ఆధారంగానే రాబోయే రోజుల్లో నేతలకు పదవుల పంపకాలు ఉంటాయని స్పష్టం చేసింది. రాష్ట్రంలో సర్పంచ్‌ల పదవీకాలం గత ఏడాది ఫిబ్రవరితోనే ముగిసింది. మండల, జిల్లా పరిషత్‌ల పదవీకాలం గత జూలైతో పూర్తయ్యింది. ఇక ఈ నెల 26వ తేదీకి ఒకటీ రెండు మినహా మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పదవీ కాలం కూడా ముగియనున్న నేపథ్యంలో ఏఐసీసీ వాటి ఎన్నికలపై దృష్టి సారించింది. రాష్ట్రంలో పార్టీ సంసిద్ధతపై ఆరా తీసింది. ఇటీవల నిర్వహించిన రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో కేసీ పలు అంశాలపై రాష్ట్ర నేతలకు దిశానిర్దేశం చేసింది.

మంత్రుల పనితీరుపై నివేదికలు

మంత్రుల పనితీరుపై ఎప్పటికప్పుడు అధిష్టానానికి నివేదికలు అందుతున్నాయని, ఇన్‌చార్జి మంత్రులు తమ తమ జిల్లాల కార్యకర్తల్లో నూతనోత్సాహాన్ని నింపేలా బాధ్యత తీసుకోవాలని కేసీ వేణుగోపాల్‌ సూచించారు. జీహెచ్‌ఎంసీ, స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్థత, ఆయా ఎన్నికల్లో విజయడంకా మోగించడంపై దిశానిర్దేశం చేశారు. పీసీసీకి సంబంధించి సంస్థాగత పునర్నిర్మాణంతో పాటు జిల్లాల్లో ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, మిగిలిపోయిన నామినేటెట్‌ పదవులు, కార్పొరేషన్‌ చైర్మన్ల నియామకం తదితర అంశాలపై సూచనలు ఇచ్చారు. త్వరలో రాష్ట్రంలో నిర్వహించనున్న రాహుల్‌గాంధీ సభ విజయవంతం చేసేలా రూపొందించిన ప్రణాళికలపై చర్చించారు.

Tags

Next Story