Telangana High Court : రాష్ట్ర ఎన్నికల సంఘం తీరుపై తెలంగాణ హైకోర్టు తీవ్ర అసహనం

రాష్ట్ర ఎన్నికల సంఘం తీరుపై తెలంగాణ హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. కరోనా క్లిష్ట పరిస్థితుల్లో ఎన్నికలకు ఎందుకు ముందుకు వెళ్లారని ప్రశ్నించింది. ప్రజల ప్రాణాలు విలువైనవా? ఎన్నికలా? అంటూ హైకోర్టు నిలదీసింది. యుద్ధం వచ్చినా.. ఆకాశం మీదపడినా ఎన్నికలు జరగాల్సిందేనా?.. క్షేత్రస్థాయిలో పరిస్థితులు గమనిస్తున్నారా? ఎస్‌ఈసీ అధికారులు భూమిపై నివసిస్తున్నారా? ఆకాశంలోనా? అని హైకోర్టు ప్రశ్నించింది.
కొన్ని మున్సిపాలిటీల ఎన్నికలకు ఇంకా సమయం ఉంది కదా? అన్న హైకోర్టు ప్రశ్నకు.. ప్రభుత్వ ఏకాభిప్రాయంతోనే ఎన్నికలు నిర్వహిస్తున్నామని ఎస్‌ఈసీ సమాధానం ఇచ్చారు. ఫిబ్రవరిలోనే కరోనా రెండో దశ మొదలైనా..ఏప్రిల్‌లో నోటిఫికేషన్ ఎందుకిచ్చారని.. ఎన్నికల ప్రక్రియ ప్రారంభించి ప్రభుత్వాన్ని అడగాల్సిన అవసరం ఏంటని హైకోర్టు ప్రశ్నించింది.
ఎన్నికలను వాయిదా వేయడానికి సొంతంగా నిర్ణయం తీసుకునే అధికారం లేదా అన్న హైకోర్టు కనీసం ఎన్నికల ప్రచార సమయాన్ని కూడా కుదించలేదని అసహనం వ్యక్తం చేసింది. ప్రభుత్వ యంత్రాంగం కరోనా నియంత్రణ వదిలేసి.. ఎన్నికల పనుల్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందన్న హైకోర్టు.. కాసేపట్లో ఎన్నికల సంఘం అధికారులు హాజరుకావాలని ఆదేశించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com