Swachh Survekshan : స్వచ్ఛ్ సర్వేక్షన్‌లో తెలంగాణకు అవార్డుల పంట

Swachh Survekshan : స్వచ్ఛ్ సర్వేక్షన్‌లో తెలంగాణకు అవార్డుల పంట
Swachh Survekshan : స్వచ్ఛ భారత్ గ్రామీణ్‌లో తెలంగాణ నెంబర్ 1గా నిలిచింది

Swachh Survekshan : తెలంగాణకు అవార్డుల పంట పండింది. స్వచ్ఛ భారత్ గ్రామీణ్‌లో తెలంగాణ నెంబర్ 1గా నిలిచింది. మరికొన్ని విభాగాల్లోనూ తెలంగాణకు అవార్డులు వచ్చాయి. మిషన్ భగీరథ పథకం క్రింద ఇంటింటికి మంచినీరు అందిస్తున్న తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వ జలజీవన్ మిషన్ పురస్కారం లభించింది. గ్రామాల్లో ఇంటింటికి 100 శాతం నల్లా నీరు అందిస్తున్న పెద్ద రాష్ట్రంగా దేశంలో తెలంగాణ నిలిచింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా మిషన్ భగీరథకు జలజీవన్ పురస్కారం అందజేశారు.

స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డుల్లో తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది. కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ సహాయ మంత్రి కౌశల్ కిషోర్ చేతుల మీదుగా మంత్రి కేటీఆర్‌ అవార్డు అందుకున్నారు. ఇక తెలంగాణలోని 16 ప‌ట్టణ, స్థానిక సంస్థల‌కు స్వచ్ఛ స‌ర్వేక్షణ్-2022 అవార్డులు దక్కాయి. కార్పొరేటర్లు అవార్డులను అందుకున్నారు. తెలంగాణకి అవార్డులు దక్కడంపై మంత్రి కేటీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు.

ఇక మొత్తంగా చూసుకుంటే అన్ని రంగాల్లో కలిపి తెలంగాణకు మొత్తం 13 అవార్డులు దక్కాయి. తెలంగాణకు ఇన్ని అవార్డులు రావడంపై రాష్ట్ర ప్రభుత్వం హర్షం వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం ఈ అవార్డులు అని పేర్కొంటున్నారు.

స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకుల్లో విశాఖ 9వ స్థానం నుంచి నాలుగో ర్యాంకు చేరింది. విజయవాడ మూడో స్థానం నుంచి ఐదో స్థానానికి పరిమితమైంది. టాప్‌ 100 ర్యాంకుల్లో ఏపీలోని ఐదు నగరాలకు చోటు దక్కింది. పది లక్షల్లోపు జనాభా నగరాల్లో తిరుపతి మొదటి స్థానానికి చేరింది. రాజమండ్రి 41 నుంచి 91కు పడిపోయింది. కడప 51 నుంచి 93కు చేరింది. కర్నూలు 70 నుంచి 55కు, నెల్లూరు 60వ స్థానాన్ని దక్కించుకుంది.

ఇదిలా ఉండగా జాతీయ స్థాయి స్వచ్ఛత నగరాల జాబితాలో విజయవాడ ఈ ఏడాది వెనుక బడింది. గతం కంటే రెండు ర్యాంకులు పడిపోయింది. గతేడాది స్వచ్ఛ నగరాల జాబితాలో విజయవాడ జాతీయ స్థాయిలో 3వ స్థానంలో నిలవగా, ఈ సారి ఐదోస్థానానికి పరిమితమైంది. మరోవైపు స్టేట్‌ క్యాపిటల్‌ విభాగంలో మాత్రం మొదటి వరుసలో నిలిచింది.

దేశ వ్యాప్తంగా 73లక్షల 95 వేల 680 మంది ఆన్‌లైన్‌లో ఫీడ్ బ్యాక్‌ సేకరించారు. 2701 మంది క్షేత్రస్థాయిలో పర్యటించి 17,030 వాణిజ్య ప్రాంతాలు, 24,744 నివాస ప్రాంతాలు, 16,501 చెత్త శుద్ధి కేంద్రాలు, 1496 రెమిడియేషన్‌ సైట్లను సందర్శించి క్షేత్ర స్థాయిలో తీసిన 22.26లక్షల ఫోటోలను విశ్లేషించి ర్యాంకుల్ని ఖరారు చేశారు.

నగరాల్లో విశాఖపట్నం 7500 మార్కులకు 6701 మార్కులతో నాలుగో స్థానంలో, 6699 మార్కులతో విజయవాడ 5 స్థానంలో, 6584 మార్కులతో తిరుపతి ఏడో స్థానంలో , 4810 మార్కులతో 75వ ర్యాంకుతో కర్నూలు, 4688 మార్కులతో 81వ స్థానంలో నెల్లూరు పట్టణాలు స్వచ్ఛభారత్‌ ర్యాంకుల్ని దక్కించుకున్నాయి.

ఢిల్లీ తాల్ కటొరా స్టేడియంలో జరిగిన స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల ప్రధానోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్యఅతిథిగా హాజరై అవార్డులను ప్రదానం చేశారు. స్వచ్ఛత, పరిశుభ్రత అంశాల్లో ఉన్నతంగా నిలిచిన మున్సిపాలిటీలు, నగరాల ప్రతినిధులకు అవార్డులు అందజేశారు రాష్ట్రపతి. దేశంలోనే అత్యంత పరిశుభ్ర నగరాల జాబితాలో ఇండోర్‌ తొలి స్థానంలో నిలిచింది. స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డుల్లో వరుసగా ఆరోసారి అగ్రస్థానం కైవసం చేసుకుంది ఇండోర్. ఈ లిస్టులో సూరత్‌, ముంబయి రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి.

దేశవ్యాప్తంగా చేపట్టిన స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వేలో అత్యంత స్వచ్ఛమైన రాష్ట్రంగా నిలిచింది మధ్యప్రదేశ్. ఆ తరవాత ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర ఉన్నాయి. భారత్‌లో 40 లక్షలకుపైగా జనాభా ఉన్న "అత్యంత స్వచ్ఛమైన మెగా సిటీ"గా అవార్డు దక్కించుకుంది గుజరాత్‌లోని అహ్మదాబాద్. టాప్‌ 10 నగరాల్లో ఢిల్లీ 9వ స్థానంలో నిలిచింది. ఢిల్లీ అర్బన్ లోకల్ బాడీకి కూడా "Clean Small City" పురస్కారం దక్కింది.

Tags

Read MoreRead Less
Next Story