Telangana Current Bill: ఏపీ బాటలో తెలంగాణ.. కరెంటు ఛార్జీల విషయంలో..

Telangana Current Bill: ఏపీ బాటలో తెలంగాణ.. కరెంటు ఛార్జీల విషయంలో..
Telangana Current Bill: తెలంగాణలో విద్యుత్ ఛార్జీలు భారీగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Telangana Current Bill: తెలంగాణలో విద్యుత్ ఛార్జీలు భారీగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. యూనిట్‌కు రూపాయి చొప్పున పెంచాలనే ఆలోచనలో ఉంది ప్రభుత్వం. ఇప్పటికే విద్యుత్ ఛార్జీలు పెంచక తప్పదని ప్రభుత్వం కూడా సంకేతం ఇచ్చింది. యూనిట్‌కు కనీసం రూపాయి పెంచితే తప్ప డిస్కమ్‌లు గట్టెక్కలేవని అధికారులు చెబుతున్నారు. యూనిట్‌కు రూపాయిపైనే ప్రతిపాదిస్తే.. ఈఆర్‌సీ రూపాయికే ఆమోదముద్ర వేయొచ్చనే ఆశాభావంతో ఉన్నారు.

ఇప్పటికే డిస్కమ్‌లు ప్రభుత్వం ముందు మూడు ప్రతిపాదనలు ఉంచినట్లు తెలుస్తోంది. యూనిట్‌కు 50 పైసలే పెంచితే లోటు భర్తీ అవుతుందా లేదా, ఒకవేళ రూపాయి పెంచితే ఎలా, రెండు రూపాయలు పెంచడం వల్ల ఎంతవరకు లోటు భర్తీ అవుతుందో నివేదిక ఇచ్చినట్లు విద్యుత్‌ రంగ వర్గాలు చెబుతున్నాయి. ఈ నివేదికపై మంత్రులు, హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి సుదీర్ఘంగా చర్చించారు.

విద్యుత్తుసౌధలో అధికారులతోనూ సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా చార్జీల పెంపు తప్పదనే సంకేతాలిచ్చారు. ఛార్జీలు పెంచాలా వద్దా అనే దానిపై సీఎం కేసీఆర్‌ తుది నిర్ణయం తీసుకుంటారు. యూనిట్‌కు రూపాయి పెంచడానికే ప్రభుత్వం అనుమతిచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో విద్యుత్ ఛార్జీలు పెంచడానికి కారణాలు అన్వేషిస్తోంది ప్రభుత్వం. రాష్ట్రంలో ఐదేళ్లుగా కరెంటు ఛార్జీలు పెంచలేదని మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి చెబుతున్నారు.

దీనికి తోడు కరోనా కారణంగా డిస్కమ్‌లకు రావాల్సిన 4వేల 374 కోట్ల బిల్లులు ఆగిపోవడం, బొగ్గు ధరలు 10 శాతం వరకు పెరగడం, నాలుగేళ్లుగా బొగ్గు రవాణాకు రైల్వే ఛార్జీలను 40 శాతం వరకు పెంచడంతో ఆ నష్టాలను పూడ్చుకోవాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం చెబుతోంది. మరోవైపు డిస్కమ్‌ల నష్టాలపైనా సమీక్ష జరిపారు. ప్రతి వ్యవసాయ కనెక్షన్‌కు సబ్సిడీ ఇవ్వడంతో పాటు గృహ వినియోగదారులకు 200 యూనిట్ల దాకా రాయితీతో కరెంటు సరఫరా చేస్తున్నారు.

ఇక ఎత్తిపోతల పథకాల కరెంట్‌ బిల్లులకు 3వేల 200 కోట్లు చెల్లిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీలకు 101 యూనిట్ల దాకా, ధోబీ ఘాట్లు, సెలూన్లకు 250 యూనిట్ల దాకా ఉచితంగా విద్యుత్తును సరఫరా చేస్తున్నారు. మోదీ ప్రభుత్వం డిస్కమ్‌లకు షాక్‌ ఇస్తోందని, టన్నుకు 50 ఉండే స్వచ్ఛ ఇంధన సెస్‌ను 400లకు పెంచడంతో ఏడేళ్లలో 7వేల 200 కోట్ల అదనపు భారం పడిందని చెబుతున్నారు. మొత్తానికి ఈ నష్టాలన్నింటినీ పూడ్చుకోవాలంటే విద్యుత్ ఛార్జీలు పెంచక తప్పదనే అభిప్రాయానికి వస్తోంది తెలంగాణ ప్రభుత్వం.

Tags

Read MoreRead Less
Next Story