TS: ఫిబ్రవరిలో స్థానిక ఎన్నికలు..?

తెలంగాణలో పంచాయతీ, మండల, జిల్లా పరిషత్తులకు ఎన్నికలు ఫిబ్రవరిలోనే జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 26 నుంచి అమలు కానున్న పథకాల వేడిలోనే ఈ ఎన్నికలను నిర్వహించేందుకు రేవంత్ సర్కారు సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 26 నుంచి రైతులకు రైతు భరోసా, భూమిలేని రైతు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, పేదలకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, రేషన్ కార్డు లేని వారికి కొత్త రేషన్ కార్డుల మంజూరు కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేయనుంది. ఈ వేడిలోనే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని హస్తం పార్టీ చూస్తోంది. స్థానిక సంస్థలకు ఎన్నికలు ఆలస్యమవుతున్న నేపథ్యంలో ఆయా సంస్థలకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు పెండింగ్‌లో పడుతున్నాయి. దీంతో ఎన్నికలు త్వరగా నిర్వహించాలని హస్తం పార్టీ భావిస్తోంది. ఫిబ్రవరి మూడో వారంలో మూడు విడతలుగా గ్రామ పంచాయతీలకు, నాలుగో వారంలో ఎంపీటీసీ, జడ్పీటీసీలకు ఎన్నికలు నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం.
బీసీ రిజర్వేషన్ పెంపే చిక్కుముడి!
తెలంగాణలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు బీసీ రిజర్వేషన్ పెంపు అంశం చిక్కుముడిగా మారింది. ఈ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఇప్పటికే ప్రభుత్వం కులగణన సర్వే నిర్వహించింది. సీఎం రేవంత్ దావోస్ పర్యటనను ముగించుకుని వచ్చాక దీనిపై స్పష్టత రానుంది. అయితే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు 50 శాతానికి మించొద్దని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.
ఫిబ్రవరి కాకపోతే ఏప్రిల్ లోనే!
స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేసుకున్నామని తెలంగాణ ఎన్నికల సంఘం అధికారులు కూడా వెల్లడించారు. రేవంత్ ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే 15 రోజుల్లో నిర్వహణ పూర్తి చేస్తామని అంటున్నారు. అయితే ఫిబ్రవరిలో ఎన్నికలు జరపాలని ప్రభుత్వం భావిస్తే.. అదే నెల 10వ తేదీ తర్వాత ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంటుంది. దీంతో ఎన్నికల కోడ్ లోపు పథకాల అమలు పూర్తవుతుందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కాకపోతే ఏప్రిల్ లోనే ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com