TG: పటిష్ట భద్రత మధ్య ఓట్ల లెక్కింపు

TG: పటిష్ట భద్రత మధ్య ఓట్ల లెక్కింపు
X
తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్‌... మధ్యాహ్నం నాలుగు లోపు లెక్కింపు పూర్తి

మూడంచెల పటిష్ఠ భద్రత ఏర్పాట్ల నడుమ తెలంగాణలోని 17లోక్‌సభ స్థానాల ఓట్ల లెక్కింపు జరుగుతుందని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి వికాస్‌రాజ్‌ తెలిపారు. ఈ నెల 4న ఉదయం 8గంటలకు పోస్టల్‌ బ్యాలెట్‌తో లెక్కింపు ప్రారంభమవుతుందని వెల్లడించారు. కౌంటింగ్‌ ప్రక్రియ మధ్యాహ్నాం 3 నుంచి 4 గంటల వరకు పూర్తవుతుందని అంచనావేస్తున్నట్లు పేర్కొన్నారు.

తెలంగాణలోని 17లోక్‌సభ స్థానాల ఎన్నికల లెక్కింపునకు సంబంధించి ఈసీ పటిష్ఠ ఏర్పాట్లు చేసింది ఈ నెల 4న జరిగే కౌంటింగ్‌కు సంబంధించిన ఏర్పాట్లను తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్‌ వెల్లడించారు. ఉదయం 8 గంటలకు పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపు అనంతరం... ఎనిమిదిన్నర గంటలకు ఈవీఎం ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని తెలిపారు. మూడు అసెంబ్లీ సెగ్మెంట్లలో అత్యధికంగా 24 రౌండ్లు, మరో మూడు అసెంబ్లీ సెగ్మెంట్లలో అత్యల్పంగా 13 రౌండ్ల లెక్కింపు ఉంటుందని వికాస్‌రాజ్‌ తెలిపారు. ఈవీఎం కౌంటింగ్‌ పూర్తయిన తర్వాత..... ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లలో ఐదు పోలింగ్‌ స్టేషన్లను ఎంపిక చేసి వీవీ ప్యాట్లను లెక్కిస్తామని తెలిపారు. ఈవీఎంలో ఓట్లు, వీవీప్యాట్లను సరిపోల్చుతామని వెల్లడించారు.

స్ట్రాంగ్‌ రూమ్‌ నుంచి లెక్కింపు కేంద్రం వరకు, బారికేడ్లు, పటిష్ఠ భద్రత ఉంటుందని సీఈఓ వికాస్‌రాజ్‌ తెలిపారు. కౌంటింగ్‌ కేంద్రంలోకి ఎలక్ట్రానిక్‌ పరికరాలు తీసుకెళ్లేందుకు అనుమతి లేదని.... ఏజెంట్ల వద్ద, సిబ్బంది వద్ద కూడా సెల్‌ఫోన్లు ఉండవని స్పష్టం చేశారు.ఈ నెల 5న నల్గొండ-వరంగల్‌‌-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక లెక్కింపునకు సంబంధించి కూడా పటిష్ఠఏర్పాట్లు చేసినట్లు సీఈఓ వికాస్‌రాజ్‌ వెల్లడించారు.

Tags

Next Story