DEATH PENALTY: బాలుడిని హతమార్చిని నిందితుడికి ఉరిశిక్ష
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మహబూబాబాద్ బాలుడి హత్య కేసులో కోర్టు కీలక తీర్పునిచ్చింది. బాలుడికి మాయమాటలు చెప్పి వెంట తీసుకెళ్లి దారుణంగా హత్య చేసిన నిందితుడికి న్యాయస్థానం మరణ శిక్ష విధించింది. దీక్షిత్‌ను కిరాతకంగా హత్య చేసి కన్నవారికి తీరని గర్భశోకం మిగిల్చిన నిందితుడికి మరణ శిక్ష విధిస్తూ మహబూబాబాద్ జిల్లా కోర్టు తీర్పు వెలువరించింది. డబ్బు కోసమే బాబును హత్య చేసినట్టు దర్యాప్తులో పోలీసులు గుర్తించి తగిన సాక్ష్యాధారాలను ఆధారపూర్వకంగా సమర్పించారు. మూడేళ్లు అన్ని కోణాల్లో విచారణ జరిపిన న్యాయస్థానం తాజాగా ఉరిశిక్ష విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.
మహబూబాబాద్‌లోని కృష్ణకాలనీకి చెందిన కుసుమ రంజిత్‌రెడ్డి-వసంతల పెద్ద కుమారుడు దీక్షిత్ రెడ్డి 2020 అక్టోబర్ నెలలో అపహరణకు గురయ్యాడు. బాబు కిడ్నాప్ వ్యవహారం అప్పట్లో సంచలనం రేపగా సవాల్‌గా మారిన ఈ కేసును పోలీసులు అప్పట్లో చాకచక్యంగా ఛేదించారు. కిడ్నాప్ చేసిన గంటల వ్యవధిలోనే బాలుడిని హత్య చేయటంతో ఈ ఘటన విషాదాంతమైంది. తొలుత డబ్బులు డిమాండ్ చేసిన సాగర్ ఆ సొమ్ము తయారుచేసుకునేలోపే కేసముద్రం రోడ్‌లోని దానవాయి గుట్టల్లోకి తీసుకెళ్లి అతికిరాతకంగా గొంతు నులిమి చంపేశాడు. ఆ పై ఆధారాలు దొరకకుండా ఉండేందుకు పెట్రోల్ పోసి శవాన్ని తగులబెట్టాడు.
బాధిత కుటుంబానికి పరిచయం ఉన్న సాగర్ అనే యువకుడే ఈ దారుణానికి ఒడిగట్టినట్టు పోలీసులు గుర్తించారు. మహబూబాబాద్‌కు సమీపంలోని శనిగపురం గ్రామానికి చెందిన సాగర్...తొలుత ఆటోమొబైల్ దుకాణంలో పనిచేసేవాడు. ఆ తర్వాత ఇసుక కూలీగా రంజిత్ దగ్గరే పనికి కుదిరాడు. ఈ క్రమంలోనే నిందితుడు మహబూబాబాద్‌కు మకాం మార్చాడు. 2020 అక్టోబర్ 18న సాయంత్రం వేళ దీక్షిత్‌ను సాగర్ ద్విచక్రవాహనంపై చాక్లెట్ కొనిస్తానంటూ తీసుకెళ్లాడు. సమీపంలోని దానవాయి గుట్టలపైకి తీసుకెళ్ళాడు. బాలుడు ఏడుపుతో భయపడ్డ నిందితుడు కిడ్నాప్ విషయం ఎక్కడ బయటపడుతుందోనని... దీక్షిత్‌కి నిద్రమాత్రలు ఇచ్చాడు. మత్తులో ఉండగానే చేతిరుమాలుతో చేతులు కట్టి బాలుడి టీషర్టుతోనే మెడకు ఉరి బిగించి హత్య చేశాడు. బాలుడిని చంపాక తన చరవాణి నంబరు తెలవకుండా నిందితుడు యాప్‌ల ద్వారా తల్లిదండ్రులకు ఫోన్ చేసి డబ్బు డిమాండ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. రంజిత్ ఫిర్యాదుతో అన్ని కోణాల్లో విచారించారు. నిందితుడు సాగర్ రంజిత్ ఇంట్లోనే తిరుగుతూ కుటుంబసభ్యులు, పోలీసులు కదలికలను నిశితంగా గమనించినట్లు దర్యాప్తులో తేలింది. కిడ్నాపర్‌కు డబ్బులు ఇచ్చేందుకు కన్నవారు సిద్ధపడ్డారు. చెప్పిన స్థలానికి సొమ్ము, బంగారం తీసుకెళ్ళగా...పోలీసుల నిఘా ఉందని అక్కడి నుంచి జారుకున్నాడని మహబూబాబాద్ జిల్లా SP చంద్రమోహన్ తెలిపారు. మానుకోట జిల్లా న్యాయమూర్తి తీర్పుపై తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com