KTR Respond on Tweet : సామాన్యుడి ట్వీట్.. అరగంటలో పరిష్కారం

తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సోషల్ మీడియా ద్వారానే చాలా సమస్యలకి పరిష్కారం చూపించారు కేటీఆర్. తెలంగాణలో అత్యధిక మంది ఫాలో అవుతున్న మంత్రి కూడా ఆయనే కావడం విశేషం. అయితే తాజాగా మరో సామాన్యుడు చేసిన ట్వీట్ (Tweet) కి వెంటనే స్పందించి పరిష్కారం చూపించారు మంత్రి. ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలోని కొహెడకు వెళ్లే సర్వీస్ రోడ్డులో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు భారీగా చెత్తను (Garbage) పడేశారు.
దీనితో ఆ మార్గం గుండా ప్రయాణించే ప్రయాణికులకి ఇబ్బందికరంగా మారింది. అయితే దీనిని ఫొటోలను తీసి తాళ్ల బాలశివుడుగౌడ్ అనే ఓ ప్రయాణికుడు మంత్రి కేటీఆర్ కి ఫిర్యాదు చేశాడు. దీనిపైన వెంటనే స్పందించిన మంత్రి సమస్యను ఆదిబట్ల మున్సిపల్ కమిషనర్ సరస్వతి దృష్టికి తీసుకువెళ్ళారు. దీనితో అక్కడి చెత్తను సిబ్బందితో తొలిగించారు. ఇదంతా కేవలం అరగంట వ్యవధిలోనే జరగడం విశేషం. దీనిపట్ల అక్కడి స్థానికులు హర్షం వ్యక్తం చేస్తుండగా, నెటిజన్లు కూడా మంత్రి కేటీఆర్ (KTR) ని అభినందిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com