PONNAM: సెట్విన్ ను యువతకు మరింత చేరువ చేస్తాం: పొన్నం ప్రభాకర్

PONNAM: సెట్విన్ ను యువతకు మరింత చేరువ చేస్తాం: పొన్నం ప్రభాకర్
X
సెట్విన్ ప్రధాన కార్యాలయాన్ని పరిశీలించిన మంత్రి... అండగా ఉంటామని భరోసా

నిరుద్యోగ యువతీ యువకుల కోసం ఏర్పాటు చేసిన ప్రభుత్వ రంగ సంస్థ సెట్విన్ ను బలోపేతం చేసేందుకు కట్టుబడి ఉన్నామని... తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సెట్విన్ సంస్థను అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. సెట్విన్ ప్రధాన కార్యాలయాన్ని పరిశీలించిన మంత్రి... అధునాతన వసతులతో రూపొందించిన చైర్మన్ కార్యాలయాన్నిప్రారంభించారు. ఈ సందర్భంగా సెట్విన్ సంస్థ నిర్వహిస్తున్న కార్యక్రమాలు, శిక్షణా తరగతులను చైర్మన్ ఎన్. గిరిధర్ రెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ కె.వేణుగోపాల్ రావును అడిగి తెలుసుకున్నారు. సెట్విన్ సంస్థ నిర్వహిస్తున్న శిక్షణ, ట్రాన్స్ పోర్ట్, ట్రేడింగ్ ద్వారా ఆదాయాన్ని సమకూర్చే విధంగా తన వంతు సహకారం తప్పక ఉంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. జంట నగరాల్లోని నిరుద్యోగులకు శిక్షణ అందించి ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో 1978సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి గౌ. శ్రీ మర్రి చెన్నా రెడ్డి ఒక మంచి ఆశయంతో సెట్విన్ సంస్థను స్థాపించడం జరిగిందని అన్నారు. ఎంతో గొప్ప ఆశయంతో ఏర్పాటు చేసిన ఈ సంస్థ ద్వారా నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాల కల్పనకు కృషి చేయడం అభినందనీయమని అన్నారు. ఎలక్ట్రిక్ ఈ ఆటో సేవలను సెట్విన్ ద్వారా అందించడంతో పాటు మహిళకు ఉపాధి అవకాశాలను కల్పనకు సహకరిస్తానని అన్నారు.


రాష్ట్రమంతా విస్తరిస్తాం: చైర్మన్

సెట్విన్ సేవలను కేవలం జంట నగరాలకే పరిమితం కాకుండా తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాలకు విస్తరించేందుకు కృషి చేస్తున్నామని సెట్విన్ చైర్మన్ ఎన్. గిరిధర్ రెడ్డి తెలిపారు. త్వరలోనే జహీరాబాద్, జెడ్చెర్ల, హుస్నాబాద్, నల్గొండ, మహబూబ్ నగర్ ప్రాంతాలలో సెట్విన్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించబోతున్నామని తెలిపారు. రాబోయే రెండు సంవత్సరాలలో 50 శిక్షణ కేంద్రాలు ఏర్పాట్లు చేసే లక్ష్యంగా ముందుకు సాగుతామని, ప్రతి ఏటా కనీసం 25 వేల మంది నిరుద్యోగ యువతీ యువకులకు శిక్షణ అందించి వారికి ఉపాధి అవకాశాలను కల్పించాలనే లక్ష్యంతో పని చేస్తున్నామన్నారు.

పేదలకు అండగా ఉండేందుకే: సెట్విన్ ఎండీ

నిరుపేద యువతీ యువకులకు మెరుగైన శిక్షణ ఇచ్చి... ఉపాధి కల్పించాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నామని సెట్విన్ ఎండీ వేణుగోపాల్ రావు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ సహకారంతో ముందుకు సాగుతున్నట్లు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగులకు అండగా ఉండేందుకు శిక్షణ కేంద్రాలను పెంచాలని నిర్ణయించినట్లు తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్ సహాయ సహకారాలతో సెట్విన్ ను యువతకు మరింత చేరువ చేస్తామన్నారు.

Tags

Next Story