UTTHAM: మరమ్మతు పనులపై ఉత్తమ్‌ అసంతృప్తి

UTTHAM: మరమ్మతు పనులపై ఉత్తమ్‌ అసంతృప్తి
X
ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి పనుల్లో జోరు పెంచాలని ఆదేశం... కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీ పనుల పరిశీలన

నేషనల్‌ డ్యాంసేఫ్టీ అథారిటీ మధ్యంతర నివేదికకు అనుగుణంగా జరుగుతున్న పనులు... సుందిళ్ల బ్యారేజీలో అనుకున్నంత వేగంగా జరగడం లేదని తెలంగాణ నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తంచేశారు. ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి పనుల్లో జోరు పెంచాలని ఆదేశించారు. గత భారాస సర్కార్‌ నిర్వాకం వల్లే కాళేశ్వరం ప్రాజెక్టు నిరుపయోగంగా మారిందని విమర్శించారు. బ్యారేజీల నుంచి ప్రత్యామ్నాయ మార్గాల్లో నీటిని ఎత్తిపోసే చర్యలు చేపడుతున్నామని ప్రాజెక్టు ఈఎన్సీ తెలిపారు


కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల్లో నేషనల్‌ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మధ్యంతర నివేదిక అనుగుణంగా చేపట్టిన మరమ్మతు పనుల పురోగతిని నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పరిశీలించారు. గుత్తేదారు, నిర్మాణ సంస్థల ఖర్చుతోనే మరమ్మతు పనులు, పరీక్షలు జరుగుతున్నాయని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ముందుగా పెద్దపల్లి జిల్లాలోని సుందిళ్ల బ్యారేజి వద్ద మరమ్మతు పనుల్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రాజెక్టు ఇంజినీర్‌ ఇన్‌చీఫ్‌ అనిల్ కుమార్ పనుల వివరాలను మంత్రికి వివరించారు. వానాకాలంలో మూడు బ్యారేజీల సంరక్షణలో భాగంగా ఎలాంటి డ్యామేజీ జరగకుండా పనులు చేపట్టామని ఈఎన్సీ తెలిపారు. అనంతరం భూపాలపల్లి జిల్లాలోని అన్నారం బ్యారేజీ వద్ద పనులు పరిశీలించిన మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి... అధికారులకు దిశానిర్దేశం చేశారు. మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల్లో పనులు సంతృప్తికరంగా సాగుతుంటే.. సుందిళ్లలో నెమ్మదిగా జరుగుతున్నాయని... వేగం పెంచాలని ఆదేశించారు.

మరమ్మతు పనుల అనంతరం... ప్రత్యామ్నాయ మార్గాల్లో బ్యారేజీల నుంచి నీటిని ఎత్తిపోసే మార్గాలు అన్వేషిస్తున్నట్లు కాళేశ్వరం ప్రాజెక్టు ఈన్‌ఎసీ అనిల్‌కుమార్‌ తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై విజిలెన్స్ నివేదిక ఆధారంగా గతంలో ఇంజినీరింగ్ అధికారులను తొలగించామని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. జ్యుడీషియల్ కమిటీ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయయని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ హామీ ఇచ్చినట్లుగా తుమ్మడిహట్టి వద్ద ప్రాజెక్టు నిర్మాణం చేసి తీరుతామని ఉత్తమ్‌ స్పష్టం చేశారు

Tags

Next Story