TS: బనకచర్లకు చుక్క నీరు ఇవ్వం: ఉత్తమ్

బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావుపై తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. హరీశ్ రావు అర్థం లేని మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బనకచర్లకు చుక్క నీరు ఇచ్చేది లేదని ఉత్తమ్ తేల్చి చెప్పారు. బనకచర్ల.. ఇల్లీగల్ ప్రాజెక్టు అని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ కు లేఖ కూడా రాశామని వెల్లడించారు. చుక్క నీరు కూడా ఏపీ తీసుకెళ్లడం లేదని మంత్రి తెలిపారు. హరీష్ రావు, కేటీఆర్‌ల ఆరోపణలకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. బనకచర్ల ప్రాజెక్టును తాము అంగీకరించట్లేదని ఖరాఖండీగానే చెప్పామని గుర్తు చేశారు. గత బీఆర్ఎస్ పాలనలో జరిగిన పొరపాట్లను సరిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో నదీజలాల విషయంలో చాలా నష్టం జరిగిందని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చాక నష్టం తగ్గించే ప్రయత్నం చేస్తున్నామని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. బనకచర్ల ప్రాజెక్టు విషయంలోనూ అప్రమత్తంగానే ఉన్నామని స్పష్టం చేశారు. అభ్యంతరం వ్యక్తం చేస్తూ కేంద్ర జల్‌శక్తి ఆర్థిక మంత్రులకు ఇప్పటికే లేఖలు రాసినట్లు తెలిపారు. నిర్మలా సీతారామన్‌కు రాసిన లేఖ విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. కృష్ణా జలాల్లో 70 శాతం వాటా తెలంగాణకు ఇవ్వాలని 2015లోనే కోరినట్లు తెలిపారు. కానీ బీఆర్ఎస్ మాత్రం 299 టీఎంసీలు చాలని ఒప్పుకున్నదని గుర్తుచేశారు. నాటి బీఆర్ఎస్ నిర్ణయంతో తెలంగాణకు రావాల్సిన కృష్ణా జలాల్లో నష్టం జరిగేలా చేశారని అన్నారు.
హరీశ్ రావు పచ్చి అబద్దాలు
బనకచర్ల ప్రాజెక్టు విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే హరీష్‌రావు పచ్చి అబద్ధాలు చెప్పారని మంత్రి ఉత్తమ్ అన్నారు. బీఆర్ఎస్ పాలన పుణ్యమా? అని ఇరిగేషన్‌శాఖ కోలుకోలేని స్థితికి వెళ్లిందని తెలిపారు. రూ.లక్ష కోట్ల అప్పుతెచ్చి కాళేశ్వరం కట్టారని మండిపడ్డారు. ఎవరిని అడిగినా క్వాలిటీ లేదని చెబుతున్నారని గుర్తుచేశారు.
కౌశిక్ రెడ్డిపై ఆగ్రహం
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని ఉద్దేశించి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. కౌశిక్ రెడ్డి తీరు మార్చుకోకపోతే.. రాజకీయ భవిష్యత్ ఉండదని అన్నారు. రెడ్డి తీరు పట్ల అసహనం వ్యక్తం చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి.. మంత్రిగా తాను స్టేజి మీద ఉండగానే అల్లరి చేయడం లీడర్ లక్షణం కాదని అన్నారు. యువ రాజకీయ నాయకుడైన కౌశిక్ రెడ్డికి అంత ఆవేశం పనికి రాదని అన్నారు. కౌశిక్ రెడ్డితో తనకు ఎలాంటి రాజకీయ సంబంధాలు లేవని.. కౌశిక్ రెడ్డి తీరు మార్చుకోకపోతే భవిష్యత్ లో ఇబ్బంది పడతారని అన్నారు. సహనం కోల్పోయిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు..నకిలీ నాయకులంటూ ఫైర్ అయ్యారు.ప్రజా సంక్షేమ పథకాలను ప్రజలకు అందించేందుకు ఏర్పాటు చేసిన సభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రవర్తించిన తీరు పట్ల స్థానికులు విస్మయం చెందారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com