TG: దేశ ధాన్యాగారంగా తెలంగాణ
వరిసాగులో అగ్రగ్రామి రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణ దేశ ధాన్యాగారంగా ఆవిష్కృతమైందని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో ప్రపంచ వరి శిఖరాగ్ర సదస్సును ప్రారంభించిన మంత్రులు ఆహారభద్రతకు తెలంగాణ సర్కార్ పూర్తిగా సహకరిస్తుందని పేర్కొన్నారు. అందరికి ఆహారభద్రత కల్పనే లక్ష్యమని స్పష్టం చేశారు. హైదరాబాద్ తాజ్‌కృష్ణ హోటల్‌లో ప్రపంచ వరి శిఖరాగ్ర సదస్సు ప్రారంభమైంది. రెండురోజుల పాటు జరిగే ఈ సదస్సును మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలు ప్రారంభించారు. దేశంలో తొలిసారిగా జరుగుతున్న ఈ సదస్సుకు భారత్ సహా 25 దేశాల ప్రతినిధులు, ఐకార్ అనుబంధ ఐఐఆర్ఆర్ శాస్త్రవేత్తలు, రైస్ మిల్లర్ల సంఘాల ప్రతినిధులు, రైతులు మొత్తం 250 మంది పైగా హాజరయ్యారు.
తెలంగాణలో 1.2 కోట్ల ఎకరాల్లో ధాన్యం సాగుతో... 26 మిలియన్ టన్నుల ధాన్యం ఉత్పత్తి జరిగిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. తెలంగాణలో 220 వరి రకాలు సాగులో ఉండగా... తెలంగాణ సోనా రకం బియ్యం ప్రపంచవ్యాప్తంగా బహుళ ప్రాచుర్యం పొందిందని తుమ్మల హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుతం తెలంగాణలో 60శాతం విత్తన రకాలు సాగవుతున్నాయి. రాష్ట్రంలో నీటి పారుదల వనరులు పెరుగుతున్న వేళ... తెలంగాణ వరి ఉత్పత్తి థాయిలాండ్‌తో సమానమని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకారం అందిస్తున్నట్లు వివరించారు.
దేశంలో వరి సాగుచేసే అగ్రగామి రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. కొన్నేళ్లుగా రాష్ట్రంలో ధాన్యం సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతూ వస్తోంది. గత ఏడాది కోటి 20లక్షల ఎకరాల విస్తీర్ణంలో వరిసాగైతే.... 2కోట్ల 60లక్షల టన్నుల దిగుబడి వచ్చింది. ఈ సదస్సు ఎగుమతులకు విస్తృతమైన మార్కెట్ అవకాశాలు కల్పించడంతో పాటు... ప్రపంచస్థాయిలోని కీలకమైన వర్తకులతో స్థానిక వ్యాపారులు కలిసిపని చేసే వేదికగా ఉపకరిస్తుందని విశ్వసిస్తున్నాను.
తమ ప్రభుత్వం పూర్తి రైతు అనుకూల ప్రభుత్వమని ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. "రైతుల ప్రయోజనాలను పరిరక్షించడంపై దృష్టిసారించడంతో పాటు వారికి అన్నివిధాలుగా మద్దతు అందిస్తున్నాం. ఇన్‌ఫుట్ సబ్సిడీ, నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందించడంతో పాటు... ధాన్యాన్ని గిట్టుబాటు ధరకు కొనుగోలు చేస్తున్నాం. దేశానికే తెలంగాణ ధాన్యాగారంగా మారింది. సాగు సదుపాయాలు పెంచడంతో పాటు ఉత్పత్తిని పెంచే కొత్త రకాల వినియోగంతో ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే రెండోస్థానంలో నిలిచాం. మా ప్రభుత్వం ఈ విషయంలో ఎలాంటి సహకారం, భాగస్వామ్యం అందించేందుకైనా... పూర్తి సిద్ధంగా ఉంది” అని తెలిపారు.
సదస్సులో ధాన్యం ఎగుమతులు, దిగుమతుల సమాచారం, ఏఏ దేశాలలో ఏఏ రకాలకు గిరాకీ ఉందనే విషయాలపై సదస్సులో అవగాహన కల్పిస్తున్నారు. బియ్యం మిల్లింగ్‌లో అధునాతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, ఎగుమతులకు అనుకూలమైన వరి రకాల సాగులో యాజమాన్య పద్ధతులు, విత్తనోత్పత్తిలో నవీన పంథా తదితర అంశాలపై చర్చాగోష్ఠులు, సంప్రదింపులు జరుగుతున్నాయి. విదేశీ, దేశీయ పరిశ్రమల ప్రతినిధులు వారివారి ఉత్పత్తులు, ఎగుమతులకు అనుగుణమైన ధాన్యం రకాలను ప్రదర్శిస్తున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com