Telangana : MLA సాయన్న మృతిపై సీఎం కేసీఆర్ సంతాపం

ఎమ్మెల్యే సాయన్న మృతిపై సీఎం కేసీఆర్ సంతాపం ప్రకటించారు. ఐదుసార్లు ఎమ్మెల్యేతో పాటు పలు పదవుల ద్వారా సాయన్న చేసిన ప్రజా సేవను.. తనతో వారికున్న అనుబంధాన్ని సీఎం స్మరించుకున్నారు. సాయన్న మృతిపై దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన మంత్రి కేటీఆర్.. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
సాయన్న మృతిపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. సాయన్న అందరితో ఆత్మీయంగా మాట్లాడేవారన్నారు. సాయన్న కుటుంబ సభ్యులకు దేవుడు మనోధైర్యం ప్రసాదించాలని ప్రార్థించారు మంత్రి నిరంజన్‌రెడ్డి. సాయన్న అకాల మరణం బాధాకరమంటూ ట్వీట్ చేశారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఆయన ఆత్మకు శాంతిచేకూరాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. సాయన్న మృతిపట్ల పట్ల టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సౌమ్యుడు, సుదీర్ఘ రాజకీయ జీవితంలో నగర ప్రజలకు ఎనలేని సేవలందించిన సాయన్న అకాల మరణం దిగ్భ్రాంతిని కలిగించిందన్నారు.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న కన్నుమూశారు. యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా గుండె, కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన.. ఈనెల 16న ఆస్పత్రిలో చేరారు. వైద్యులు ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో ఇవాళ మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. సాయన్న భౌతికకాయాన్ని.. ఆస్పత్రి నుంచి అశోక్ నగర్‌లోని ఆయన నివాసానికి తరలించారు కుటుంబ సభ్యులు.
1951 మార్చి 5న జన్మించిన సాయన్న బీఎస్సీ, ఎల్‌ఎల్‌బీ చదివారు. ఆయనకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వివాదరహితుడిగా పేరు తెచ్చుకున్నారు. టీడీపీతో రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన సాయన్న.. కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. టీడీపీ తరఫున 1994, 1999, 2004, 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకరరావు చేతిలో ఓడిపోయారు. 2014 తర్వాత సాయన్న బీఆర్‌ఎస్‌లో చేరారు. 2015లో టీటీడీ పాలకమండలి సభ్యుడిగానూ పనిచేశారు. హుడా డైరెక్టర్‌గా ఆరుసార్లు బాధ్యతలు నిర్వర్తించారు. వీధిబాలలకు పునరావాసంపై హౌస్ కమిటీ ఛైర్మన్‌గా చేశారు. 2018 ఎన్నికల్లో బీఆర్‌ఎస్ కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com