రేపే ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్.. గెలుపునకు దగ్గర్లో ఎవరు ఉన్నారో తెలియాలంటే!

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల లెక్కింపు ప్రక్రియ హైదరాబాద్ సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో రేపు ప్రారంభంకానుంది. ఇందుకు అధికారులు, పోలీసులు విస్తృత ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ మూడు నియోజకవర్గాల పరిధిలో మొత్తం 3 లక్షల 57 వేల 354 ఓట్లు పోలయ్యాయి. పోలైన ఓట్లను లెక్కించేందుకు సుధీర్ఘ సమయం పట్టే అవకావం ఉంది. దీంతో షిఫ్టుల వారీగా అధికారులకు, సిబ్బంది పనిచేయనున్నారు.
ఇక ఓట్ల లెక్కింపు ప్రక్రియను ఒకసారి పరిశీలిస్తే.. మొత్తం 8 హాళ్లను వినియోగిస్తున్నారు. ఒక్కో హాల్లో 7 టేబుల్స్ చొప్పున మొత్తం 56 టేబుళ్లను ఏర్పాటు చేసారు. వీటిపై 799 పోలింగ్ కేంద్రాల నుంచి వచ్చిన ఓట్లను లెక్కిస్తారు. ఒక్కో టేబుల్‌పై బ్యాలెట్ పత్రాలను పెట్టిన అనంతరం 25 బ్యాలెట్ పత్రాలకు ఒకటి చొప్పున కట్టలు కడతారు. ప్రస్తుతం పోలైన ఓట్ల ప్రకారం 25 చొప్పున బ్యాలెట్ పత్రాలను ఒక కట్ట కట్టడానికి అధిక సమయం పట్టే అవకాశం ఉంది. అంటే ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభమైతే రాత్రి 8 గంటల వరకు కేవలం బ్యాలెట్ పత్రాలను కట్ట కట్టే ప్రక్రియ సాగే అవకాశం ఉంది.
ఇక ఆ తరువాత కట్ట కట్టిన బ్యాలెట్ పత్రాలను తెరిచి అందులో చెల్లనివి, చెల్లే ఓట్లను రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులు, మైక్రో అబ్జర్వర్లు, కౌంటింగ్ ఏజెంట్ల సమక్షంలో వేరు చేస్తారు. అనంతరం మొదటి ప్రాధాన్యత ఓట్లను అభ్యర్థుల వారీగా లెక్కిస్తారు. ఇలా 56 టేబుళ్లపైనా ఏకకాలంలో ప్రక్రియ సాగుతుంది. ఇది సుమారు గంటన్నర సమయం పట్టే అవకాశాలున్నట్లు అధికారులు తెలిపారు.
రాత్రి తొమ్మిదిన్నర తర్వాతే తొలి సమాచారం తెలిసే అవకాశం ఉంది. టేబుల్‌కు వెయ్యి చొప్పున 56 వేల ఓట్లను ఏకకాలంలో లెక్కిస్తారు. 3 లక్షల 57 వేల 354 ఓట్లను లెక్కించడానికి దాదాపు పది గంటల సమయం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. రెండో రోజు ఉదయానికి కానీ ఎవరు గెలుపునకు దగ్గర్లో ఉన్నారనేది తేలదు.
ఈనెల 17న ప్రారంభమయ్యే ఓట్ల లెక్కింపునకు రెండు నుంచి మూడు రోజుల సమయం పట్టే అవకాశం ఉన్నందున 19వ తేదీ వరకు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. కౌంటింగ్ పూర్తయ్యే వరకు సిబ్బందికి కనీస వసతులు అక్కడే ఏర్పాటు చేశారు ఎన్నికల అధికారులు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com