TS DGP: తెలంగాణ డీజీపీగా జితేందర్‌!

TS DGP: తెలంగాణ డీజీపీగా జితేందర్‌!
ఇప్పటికే నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి!... నేడు ఉత్తర్వులు వెలువడే అవకాశం

తెలంగాణ డీజీపీగా సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి జితేందర్‌ నియామకం దాదాపు ఖరారైంది. డీజీపీగా జితేందర్‌ను నియమించాలని సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు నేడు జారీ కానున్నట్లు సమాచారం. డీజీపీగా సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి జితేందర్‌ను నియమిస్తూ ఉత్తర్వులు ఇప్పటికే వెలువడాల్సి ఉన్నా.. రేవంత్‌రెడ్డి మహబూబ్‌నగర్‌ జిల్లా పర్యటన కారణంగా వాయిదా పడింది. తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వం నియమించిన తొలి డీజీపీ జితేందర్‌ కానున్నారు. ప్రస్తుతం ఆయన డీజీపీ హోదాలోనే హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ జనరల్‌గా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

పంజాబ్‌ రాష్ట్రం జలంధర్‌లో రైతు కుటుంబంలో జన్మించిన జితేందర్‌ 1992 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన వారు. ఆంధ్రప్రదేశ్‌ కేడర్‌కు ఎంపికయ్యారు. తొలుత నిర్మల్‌ ఏఎస్పీగా పనిచేసిన అనంతరం బెల్లంపల్లి అదనపు ఎస్పీగా విధులు నిర్వర్తించారు. అప్పట్లో నక్సల్స్‌ ప్రభావం ఎక్కువగా ఉన్న మహబూబ్‌నగర్, గుంటూరు జిల్లాల ఎస్పీగా ఉన్నారు. ఢిల్లీ సీబీఐలో.., 2004-06 వరకు గ్రేహౌండ్స్‌లో పనిచేశారు. అనంతరం డీఐజీగా పదోన్నతి పొంది విశాఖ రేంజ్‌లో బాధ్యతలు నిర్వర్తించారు. అప్పాలో కొంతకాలం పనిచేసి తెలంగాణ ఉద్యమం సమయంలో వరంగల్‌ రేంజ్‌ డీఐజీగా కొనసాగారు. ఆంధ్రప్రదేశ్‌ సీఐడీ, ఎంక్వయిరీ కమిషన్, విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌లో బాధ్యతలు నిర్వర్తించిన అనంతరం హైదరాబాద్‌ కమిషనరేట్‌లో ట్రాఫిక్‌ అదనపు కమిషనర్‌గా పనిచేశారు. తర్వాత తెలంగాణ శాంతిభద్రతల విభాగం అదనపు డీజీపీగా, జైళ్లశాఖ డీజీగా పనిచేశారు. ప్రస్తుతం హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న ఆయన 2025 సెప్టెంబరులో పదవీవిరమణ చేయనున్నారు.

కోచింగ్‌ సెంటర్లపై రేవంత్‌ ఆగ్రహం

తెలంగాణలో కోచింగ్ సెంటర్ల మాఫియా పరీక్షలు వాయిదా వేయించాలని చూస్తోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వాళ్ల ధనదాహం కోసం నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయని మండిపడ్డారు. ఉద్యోగాలు ఇవ్వాలని తమ ప్రభుత్వం ధైర్యం చేస్తే.. ఎప్పుడు పార్టీ బలహీనపడితే.. అప్పుడు కేసీఆర్ విద్యార్థులను ముందుకు తీసుకొస్తారని అన్నారు. విద్యార్థుల శవాలతో రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నారని మండిపడ్డారు. పేదోళ్ల పిల్లల్ని రెచ్చగొట్టుడు కాదు.. మీ వాదన నిజమైతే వాళ్ల పక్షాన మీరు దీక్షకు దిగండని బీఆర్‌ఎస్‌ నేతలకు రేవంత్‌ సవాల్‌ విసిరారు. తమ ప్రభుత్వంలో నష్టం జరుగుతుందని నిజంగా మీరు అనుకుంటే.. బిల్లా రంగాలు ఆమరణ నిరాహార దీక్షకు దిగాలని రేవంత్ సూచించారు. పరీక్షలు వాయిదా వేస్తే ప్రభుత్వానికి నష్టం లేదని... నిరుద్యోగులు నష్టపోకూడదనేదే ప్రభుత్వ ఆలోచన అని రేవంత్‌ అన్నారు.

Tags

Next Story