Telangana: కొనుగోలు లక్ష్యాన్ని అందుకోలేకపోతున్న ధాన్యం.. వర్షాల్లో కుప్పలు..

Telangana: కొనుగోలు లక్ష్యాన్ని అందుకోలేకపోతున్న ధాన్యం.. వర్షాల్లో కుప్పలు..
Telangana: ఆరుగాలం కష్టించి పండించిన పంటను అమ్మేందుకు రైతాంగం కష్టాలు పడుతోంది.

Telangana: ఆరుగాలం కష్టించి పండించిన పంటను అమ్మేందుకు రైతాంగం పడుతున్న కష్టాలు.. కన్నీళ్లే తెప్పిస్తున్నాయి. ఓ వైపు ముంచుకొస్తున్న వర్షపు ముప్పు..మరోవైపు కొనుగోలు కేంద్రాల్లో పేరుకపోయిన ధాన్యం కుప్పలు.. కంటిమీదకునుకు లేకుండా చేస్తున్నాయి. చివరి గింజను కొనేదాక విశ్రమించేది లేదన్న సర్కార్ మాటలు.. నీటమూటలే అవుతున్నాయని రైతులు వాపోతున్నారు.

తెలంగాణ వ్యాప్తంగా 62 లక్షల టన్నులకుపైగా ధాన్యం కొనాల్సి ఉండగా.. మే 15 నాటికి కేవలం 16 లక్షల 66 వేల టన్నుల మేరకే ధాన్యాన్ని కొన్నట్లు తెలుస్తోంది. అటు 6 వేల 857 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉండగా.. 6వేల 169 కేంద్రాల్లోనే కొనుగోళ్లు జరుగుతున్నట్లు సమాచారం. ఇటు కల్లాల నిండా పేరుకపోతున్న ధాన్యం నిల్వల కొనుగోలుకు.. ఇంకా ఎన్నిరోజులు వేచిచూడాల్సి ఉంటుందోనని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అటు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తరుగు పేరుతో జరుగుతున్న దోపిడీపై రైతులు మండిపడుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో 40 కిలోల చొప్పున బస్తాకు తూకం వేయాల్సి ఉండగా.. తేమ సాకుతో రెండు నుంచి మూడు కిలోలు అదనంగా దోచుకుంటున్నారని రైతులు వాపోతున్నారు. క్వింటాలు ధాన్యానికి అయిదారు కిలోలు అదనంగా తరుగు పేరుతో కాటకేస్తున్నారని చెబుతున్నారు.

తరుగు దోపిడీని ప్రశ్నిస్తే.. కొనుగోళ్లను నిలిపేసి నిర్వాహకులు బెదిరింపులకు దిగుతున్నారని రైతులు వాపోతున్నారు. అటు తెలంగాణలో నైరుతి రుతుపవనాల కారణంగా ముంచుకొస్తున్న వర్షపు.. రైతులను బెంబేలెత్తిస్తోంది. ఇప్పటికే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కురిసిన అకాల వర్షాలకు కొనుగోలు కేంద్రాల్లో భారీగా ధాన్యం తడిసి రైతులకు తీవ్ర నష్టం కల్గించింది. ఒక్క కామారెడ్డి జిల్లాలోనే వంద కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిదంటే నష్ట తీవ్రత ఏ విధంగా ఉందో అర్థమవుతోంది.

ధాన్యం తెచ్చి పది రోజులైనా..సెంటర్‌లలో కొనుగోళ్లను ఆలస్యం చేయటమే ఈ దుస్థితి కారణమని రైతులు మండిపడుతున్నారు. మరోవైపు కొనుగోళ్లు జరిపిన ధాన్యం తరలించేందుకు సరిపోయినన్ని లారీలు లేక.. రవాణాలో తీవ్రజాప్యం జరుగుతోంది. లారీలో లోడ్ చేసిన ధాన్యం తిరిగి దింపేదాక రైతులదే బాధ్యత ఉండటంతో.. ఎక్కడ వర్షంతో తీవ్ర నష్టం జరుగుతుందోనని రైతులు బిక్కుబిక్కుమంటున్న పరిస్థితులు కల్లకు కడుతున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story