Phone Tapping Case : ప్రకంపనలు రేపుతున్న ఫోన్‌ ట్యాపింగ్

Phone Tapping Case : ప్రకంపనలు రేపుతున్న ఫోన్‌ ట్యాపింగ్
నిష్పక్ష విచారణకు ప్రతిపక్షాల డిమాండ్‌.... దుష్ప్రచారం అన్న కేటీఆర్‌

తెలంగాణ రాజకీయాల్లో ఫోన్‌ ట్యాపింగ్‌ అంశం ప్రకంపనలు రేపుతోంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ వ్యవహారంలో బీజేపీ, కాంగ్రెస్‌లు నిష్పక్ష విచారణకు డిమాండ్ చేస్తున్నాయి. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలంటూ రఘునందన్‌ కోరగా... నాటి సీఎం కేసీఆర్‌ ఎందుకు నోరు మెదపడం లేదని యెన్నం శ్రీనివాస్‌రెడ్డి ప్రశ్నించారు. హామీల వైఫల్యంలో ప్రజల దృష్టి మరల్చేందుకే ట్యాపింగ్‌ అంశాన్ని తెరపైకి తెస్తున్నారని మాజీ మంత్రి KTR విమర్శించారు. టెలిఫోన్‌ ట్యాపింగ్‌ దర్యాప్తులో వెలుగు చూస్తున్న అంశాలు కలకలం రేపుతున్నాయి. విపక్షాలతో పాటు ఇతర ప్రైవేట్‌ వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని ట్యాపింగ్‌కు పాల్పడి సొమ్ము పోగేసుకున్న తీరును ప్రతిపక్ష నాయకులు తప్పుపడుతున్నారు. పదేళ్లలో చేసిన నిర్వాకాలపై చిత్తశుద్ధితో దర్యాప్తు చేయాలని డిమాండ్‌చేస్తున్నారు. ఈ మేరకు బీజేపీ సీనియర్‌ నేత రఘునందన్‌రావు తెలంగాణ డీజీపి రవిగుప్తాను కలిసి కేసులో బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. గతంలో ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాపింగ్‌ అవుతున్నాయని తాను చెప్పింది ప్రస్తుతం ప్రణీత్‌రావు కేసులో దొరికిన ఆధారాలతో రూడీ అయిందని పేర్కొన్నారు. ట్యాపింగ్‌ కేసులో తొలి మద్దాయిగా అప్పటి సీఎం కేసీఆర్‌, రెండో ముద్దాయిగా హరీశ్‌రావును చేర్చాలని డిమాండ్‌ చేశారు..

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బయటకు వచ్చిన తర్వాత మాజీ మంత్రి KTR... మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ధ్వజమెత్తారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్, కేటీఆర్ జైలుకు వెళ్లాల్సిందేనని అన్నారు. బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనలో ప్రైవేటు ట్యాపింగ్ యూనివర్శిటీలు ఏర్పాటు చేశారని విమర్శలు గుప్పించారు. ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌, KTR సత్యశోధన పరీక్షకు సిద్ధమా అని యెన్నం సవాల్‌ విసిరారు..

పది లక్షల ఫోన్లు ట్యాప్ చేసినట్టు రేవంత్ రెడ్డి దుష్ప్రచారం చేస్తున్నారని.. KTR విమర్శించారు. దొంగలకు చెందిన ఒకటో, రెండో ఫోన్లను పోలీసులు ట్యాప్ చేసి ఉండొచ్చన్న కేటీఆర్‌... ఆరు గ్యారెంటీలను నెరవేర్చే దారిలేక ప్రజల దృష్టి మరల్చేందుకే ఫోన్ ట్యాపింగ్ వంటివి తెరపైకి తీసుకొస్తున్నారని విరుచుకుపడ్డారు. 30 మంది కాంగ్రెస్, కొంత మంది బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీలోకి వెళ్లాలన్నది రేవంత్ రెడ్డి ఆలోచన అని..మళ్లీ మాతృసంస్థ బీజేపీకి పోవడం ఖాయమని KTR జోస్యం చెప్పారు. రాజకీయవర్గాల్లో ఆసక్తి రేపుతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ అంశం రోజుకో మలుపు తిరుగుతోంది.

Tags

Read MoreRead Less
Next Story