ALLU ARJUN: ఏదైనా జరిగితే మీదే బాధ్యత

అల్లు అర్జున్‌కు రాంగోపాల్‌పేట్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ పరామర్శించేందుకు అల్లు అర్జున్ వస్తారనే సమాచారంతో పోలీసులు ఆయనకు నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. పరామర్శకు రావొద్దని ఆ నోటీసులో పేర్కొన్నారు. పరామర్శకు వస్తే తమ సూచనలు పాటించాలన్నారు. ఏదైనా జరిగితే అల్లు అర్జున్ బాధ్యత వహించాల్సి వస్తుందని తెలిపారు.
పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న అల్లు అర్జున్
సినీనటుడు అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట కేసులో నాంపల్లి కోర్టు ఆయనను ప్రతి ఆదివారం పోలీస్‌స్టేషన్‌లో హాజరుకావాలని ఆదేశించింది. బెయిల్ షరతుల ప్రకారం.. అల్లు అర్జున్ చిక్కడపల్లి పీఎస్‌కు వచ్చి సంతకం చేశారు. ఇప్పటికే నాంపల్లి కోర్టు అల్లు అర్జున్‌కు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.
అసలు ఏం జరిగింది..
పుష్ప2 బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ దగ్గర గత ఏడాది డిసెంబరు 4వ తేదీన జరిగిన తొక్కిసలాట ఘటనలో హీరో అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. బెయిల్ పిటిషన్‌పై గత నెల 30వ తేదీన వాదనలు పూర్తి కాగా శుక్రవారం ఈ పిటిషన్‌పై నాంపల్లిలోని రెండో మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు అదనపు న్యాయమూర్తి వినోద్ కుమార్ తీర్పును వెల్లడించారు. ఈ కేసులో ఏ11గా ఉన్న అల్లు అర్జున్ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్‌పై ఉండగా తాజాగా నాంపల్లి కోర్టు షరతులతో కూడిన సాధారణ బెయిల్ ఇచ్చింది. హత్య, హత్యకు సూత్రధారిగా అల్లు అర్జున్‌పై పోలీసులు నమోదు చేసిన సెక్షన్లు వర్తించవంటూ తాము చేసిన వాదనలతో న్యాయస్థానం ఏకీభవించి బెయిల్ మంజూరు చేసిందని బన్ని తరపు న్యాయవాదులు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com