TS POLLS: తనిఖీల్లో కట్టలుకట్టల నోట్ల కట్టలు

TS POLLS: తనిఖీల్లో కట్టలుకట్టల నోట్ల కట్టలు
ఎన్నికల కోడ్‌తో తెలంగాణలో విస్త్రతంగా వాహన తనిఖీలు... కోట్ల కొద్దీ డబ్బు స్వాధీనం

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్‌ ప్రకటనతో అభ్యర్థులు ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. మద్యం, డబ్బు సరఫరాను నియంత్రించాలన్న కేంద్రఎన్నికల సంఘం ఆదేశాలతో అధికార యంత్రాంగం తనిఖీలను ముమ్మరం చేస్తోంది. ఆ సోదాల్లో పెద్దమొత్తంలో డబ్బు, బంగారం, మద్యం పట్టుపడుతోంది. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చాక అక్రమంగా నగదు, బంగారం, మద్యం తరలింపుపై పోలీసులు దృష్టి సారించారు. వాహనాల తనిఖీల్లో రోజూ లక్షల కొద్దీ నగదు, బంగారం సహా ఇతర వస్తువులు పట్టుబడుతున్నాయి. సరైన రసీదులు చూపని నగదు, బంగారాన్ని ఐటీ శాఖ అధికారులకు పోలీసులు అప్పగిస్తున్నారు.


హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోనే 5 కోట్ల నగదు, ఏడు కిలోలకు పైగా బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మూడు కమిషనరేట్ల ఉన్నతాధికారులు, సిబ్బందితో కమిషనర్లు సమావేశాలు నిర్వహిస్తున్నారు. 24 గంటలు పని చేసేలా ప్రత్యేక సెల్‌లను ఏర్పాటు చేయాలని సూచించారు. అక్రమ నగదు, మద్యం, మాదక ద్రవ్యాలు లేదా ఇతర ప్రలోభాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇంటిగ్రేటెడ్ ఇంటర్ కమిషనరేట్ చెక్‌పోస్టుల సంఖ్యను 11 నుంచి 18కి పెంచనున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్ కుల్సుంపుర ఠాణా పరిధిలో చేపట్టిన తనిఖీల్లో ఓ వ్యక్తి నుంచి 600 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. సరైన పత్రాలు చూపకపోవడం వల్ల ఎన్నికల అధికారులకు అప్పగించారు.


చైతన్యపురి పోలీసుస్టేషన్‌ పరిధిలో చేపట్టిన తనిఖీల్లో SOT పోలీసులు ఇద్దరి వ్యక్తుల నుంచి 60 లక్షల నగదును జప్తు చేశారు. సరైన ఆధారాలు చూపనందున నిందితులపై కేసు నమోదు చేసినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. మహంకాళి ఠాణా పరిధిలో ఐదుగురు వ్యక్తుల దగ్గర నుంచి 29 లక్షల విలువైన 55 తులాల బంగారం పట్టుబడింది. ద్విచక్ర వాహనాలపై జనరల్ బజార్‌కు బంగారాన్ని తరలిస్తుండగా వారిని పట్టుకున్నారు. దోమలగూడ, గాంధీనగర్‌ పోలీస్ స్టేషన్ల పరిధిలో కారులో తరలిస్తున్న కేజీ బంగారంతో పాటు రెండు లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సరైన పత్రాలు, బిల్లులు చూపిస్తేనే బంగారం తిరిగి ఇస్తామని అధికారులు స్పష్టం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story