TG: అడ్డగోలు పోస్ట్ చేస్తే అరెస్టే

TG: అడ్డగోలు పోస్ట్ చేస్తే అరెస్టే
X
సైబర్ పెట్రోలింగ్ తో పోలీసుల నిఘా... కఠిన చర్యలకు దిగుతున్న తెలంగాణ పోలీసులు

సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు చేసే వారికి హెచ్చరిక. అభ్యంతరకర పోస్టులు, విద్వేషపూరిత, వివాదాస్పద వ్యాఖ్యలపై తెలంగాణ పోలీసులు కొరడా ఝళిపిస్తున్నారు. ‘సైబర్‌ ప్యాట్రోలింగ్‌’ ద్వారా సామాజిక మాధ్యమాల్లో పోస్టులపై నిఘా ఉంచి బాధ్యులపై సుమోటోగా కేసులు నమోదు చేస్తున్నారు. ప్రత్యేకంగా స్మాష్‌ విభాగాన్ని ప్రారంభించి అభ్యంతరకర పోస్టులు చేసినవారిని అరెస్ట్ చేసి జైలుకు పంపుతున్నారు. ఓ పార్టీ నాయకుడు నచ్చలేదన్న కారణంతో అతడి వ్యక్తిత్వాన్ని కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని వ్యాఖ్యలు.. ప్రపంచంలో ఏదో ఒక మూల జరిగిన ఘటనను దృష్టిలో పెట్టుకుని ఓ వర్గాన్ని కించపరుస్తూ విద్వేషపూరిత పోస్టులు పెడుతుండటం ఇటీవల సాధారణమైంది. వాట్సాప్‌ గ్రూపులు, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్‌లలో అడ్డగోలుగా కామెంట్లు చేస్తున్నారు. దీనిపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు.

సైబర్ పెట్రోలింగ్ తో నిఘా

సోషల్ మీడియాలో చేసే వివాదాస్పద పోస్టులు శాంతి భద్రతలతోపాటు సాధారణ ప్రజాజీవనంపైనా ఇవి తీవ్ర ప్రభావం చూపుతున్న నేపథ్యంలో కఠిన చర్యలకు దిగుతున్నారు. కేసులు పెట్టి కటకటాల వెనక్కి పంపిస్తున్నారు. కేవలం బాధితులు ఫిర్యాదు చేసినప్పుడే కాకుండా ‘సైబర్‌ ప్యాట్రోలింగ్‌’ ద్వారా సామాజిక మాధ్యమాల్లో పోస్టులపై నిఘా ఉంచి బాధ్యులపై సుమోటోగా కేసులు నమోదు చేస్తున్నారు. ఇలాంటి కామెంట్లు పెట్టి పోలీసులకు చిక్కుతున్న కేసుల్లో ఎక్కువగా విద్యార్థులు, సాధారణ ఉద్యోగులు, చిరు వ్యాపారులు ఉంటున్నారు. కేసులు నమోదయ్యాక బాధ్యుల్ని పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి విచారించినప్పుడు పొరపాటున, క్షణికావేశంలో చేశామంటూ తప్పించుకుంటున్నారు.

సోషల్ మీడియాలో పోస్టు చేస్తే స్మాషే

నెట్టింట తప్పుడు ప్రచారం, వర్గాల మధ్య విభేదాలు సృష్టిస్తున్న ఘటన హైదరాబాద్‌లోనే ఎక్కువగా నమోదవుతున్నట్లు జాతీయ నేర గణాంక సంస్థ- 2022 వెల్లడించింది. 19 మెట్రోనగరాల్లో హైదరాబాద్‌ తొలిస్థానంలో నిలిచింది. 2022లో 94, 2023లో 25, ఈ ఏడాది 20 కేసులు నమోదు చేశారు. నగరంలో తరచూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు, వీడియోలు చర్చనీయాంశంగా మారడం, కొన్నిసార్లు వర్గాల మధ్య విభేదాలకు దారి తీస్తుండడంతో హైదరాబాద్‌ పోలీసులు ప్రత్యేకంగా సోషల్‌ మీడియా యాక్షన్‌ స్క్వాడ్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ విభాగాన్ని ప్రారంభించారు. రాచకొండ, సైబరాబాద్‌ పోలీసులూ ఐటీ విభాగాలతో ప్రత్యేకంగా సైబర్‌ ప్యాట్రోలింగ్‌ నిర్వహిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో పోస్టులను గుర్తించి తగిన చర్యలు తీసుకుంటారు.

సైబర్ పెట్రోలింగ్ తో అరెస్టులు షురూ..

రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలానికి చెందిన తాపీ మేస్త్రీ వాట్సాప్‌ గ్రూపులో ఓ రాజకీయ నాయకుడి మీద అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తూ పోస్టు పెట్టాడు. దీనిపై కొందరు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. ఎల్బీనగర్‌కు చెందిన యువకుడు ఫేస్‌బుక్‌లో వచ్చిన ఓ పోస్టు చూసి ఆవేశంలో ఓ వర్గాన్ని కించపర్చేలా కామెంట్‌ పెట్టాడు. సైబర్‌ ప్యాట్రోలింగ్‌ ద్వారా ఈ కామెంట్‌ను గుర్తించిన పోలీసులు యువకుడి మీద కేసు నమోదు చేశారు. ముందు పోస్టులు పెట్టి తర్వాత తొలగించినా సాంకేతిక ఆధారాలతో పట్టుబడతారు కాబట్టి విద్యార్థులు, నిరుద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.

Tags

Next Story