TG: తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఆసక్తికర పరిణామాలు

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్‌కే పరిమితమైన రాజకీయ శక్తిగా కనిపించిన జనసేన పార్టీ ఇప్పుడు తెలంగాణలో తన ఉనికిని చాటే దిశగా అడుగులు వేస్తోంది. ప్రత్యక్షంగా ఎన్నికల బరిలోకి దిగకుండా, మున్సిపల్ ఎన్నికలను లాంఛ్‌ప్యాడ్‌గా చేసుకుని రాజకీయ విస్తరణకు ప్రయత్నించడం వెనుక వ్యూహాత్మక ఆలోచన ఉందనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. ముఖ్యంగా మిత్రపక్షమైన భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయాలన్న నిర్ణయం, తెలంగాణ రాజకీయ సమీకరణాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్నదే ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది. ఈ ప్రచారంలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ వారం తెలంగాణలో పర్యటించనున్నారు. ఆయన సభలు, రోడ్‌షోలు, మీడియా సమావేశాలు ఉంటాయని సమాచారం. దీంతో ఈ పరిణామం బీజేపీకి లాభమా? లేక అనూహ్యంగా నష్టాన్ని తెచ్చిపెడుతుందా? అన్న ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తున్నాయి.
బీజేపీకి ‘క్రౌడ్ పుల్లర్’ అవసరం
తెలంగాణలో బీజేపీ పరిస్థితి ప్రత్యేకమైనది. కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికీ, రాష్ట్ర రాజకీయాల్లో మాత్రం పార్టీ ఆశించిన స్థాయిలో దూసుకుపోలేకపోయిందన్న విమర్శలు ఉన్నాయి. నాయకత్వ లోపం కంటే ఎక్కువగా, ప్రజల్లో భావోద్వేగాన్ని రగిలించే, ముఖ్యంగా యువతను ఆకట్టుకునే ముఖచిత్రం లేకపోవడమే ప్రధాన బలహీనతగా చెప్పుకుంటున్నారు. ఈ లోటును పూడ్చేందుకు పవన్ కళ్యాణ్ వంటి ప్రజాదరణ ఉన్న నాయకుడిని రంగంలోకి దించడమే బీజేపీ వ్యూహంగా కనిపిస్తోంది. సినిమా రంగం నుంచి వచ్చిన పవన్ కళ్యాణ్‌కు తెలంగాణ పట్టణ యువతలోనూ అభిమానులు ఉన్నారు. సోషల్ మీడియాలోనూ ఆయనకు గట్టి ఫాలోయింగ్ ఉంది. ఈ అంశాన్ని బీజేపీ రాజకీయంగా మలుచుకోవాలనుకుంటోందన్న అభిప్రాయం వినిపిస్తోంది. మున్సిపల్ ఎన్నికలు చిన్న ఎన్నికలే అయినా, ఇమేజ్ బిల్డింగ్‌కు ఇవి ఉపయోగపడతాయన్న అంచనాతోనే ఈ ప్రచారానికి శ్రీకారం చుట్టినట్టు తెలుస్తోంది.
జనసేనకు ఇది విస్తరణ ప్రయోగం
ఇక జనసేన కోణంలో చూస్తే, ఇది కేవలం మిత్రధర్మం మాత్రమే కాదు, దీర్ఘకాల రాజకీయ ప్రయోగం కూడా. ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల రాజకీయంగా బలం పెంచుకున్న జనసేన, భవిష్యత్తులో ప్రాంతీయ పార్టీగా కాకుండా విస్తృత రాజకీయ వేదికపై నిలబడాలన్న ఆతో ఉందన్న ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో ఇప్పటికి సంస్థాగత నిర్మాణం లేకపోయినా, పవన్ కళ్యాణ్ వ్యక్తిగత క్రేజ్‌తో పార్టీకి గుర్తింపు తీసుకురావచ్చన్న నమ్మకం జనసేన శ్రేణుల్లో ఉంది. ప్రత్యక్షంగా పోటీ చేయకుండా, మిత్రపక్షం తరపున ప్రచారం చేయడం వల్ల రాజకీయంగా రిస్క్ తక్కువగా ఉంటుందని కూడా భావిస్తున్నారు. అదే సమయంలో, పార్టీ పేరును తెలంగాణ రాజకీయాల్లో పరిచయం చేయడం, భవిష్యత్తులో అవకాశాలను పరీక్షించుకోవడం ఈ వ్యూహం వెనక ఉన్న ప్రధాన ఉద్దేశ్యంగా విశ్లేషకులు చెబుతున్నారు.
బీఆర్ఎస్కు సెంటిమెంట్ ఆయుధమా?
అయితే ఈ మొత్తం పరిణామంలో అసలు లాభం ఎవరికి దక్కుతుందన్న ప్రశ్న ఆసక్తికరంగా మారింది. తెలంగాణలో ‘ఇంటి పార్టీ’గా తనను తాను ఆవిష్కరించుకున్న భారత రాష్ట్ర సమితి ఈ అవకాశాన్ని రాజకీయంగా మలుచుకునే ప్రయత్నంలో ఉందన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. పక్క రాష్ట్రానికి చెందిన పార్టీ నేత తెలంగాణలో ప్రచారం చేయడాన్ని ‘తెలంగాణ సెంటిమెంట్’గా మలచే అవకాశం బీఆర్ఎస్కు దక్కిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. గతంలోనూ ఇలాంటి సందర్భాల్లో బీఆర్ఎస్ తెలంగాణ అస్మితను బలంగా వినియోగించుకున్న చరిత్ర ఉంది. ఈసారి కూడా “తెలంగాణకు తెలంగాణ పార్టీ” అనే నినాదాన్ని మరింత దూకుడుగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతుందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో కూడా సెంటిమెంట్ రాజకీయంగా పనిచేస్తుందా? లేక పవన్ క్రేజ్ ముందు అది తగ్గిపోతుందా? అన్నదే కీలకంగా మారింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
