TG: ధరణి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక డ్రైవ్

పెండింగ్‌లో ఉన్న ధరణి దరఖాస్తుల పరిష్కారానికి అన్ని జిల్లాల యంత్రాంగం చర్యలు చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం జిల్లా అధికారులకు స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో వివిధ దశల్లో పెండింగ్ లో ఉన్న అప్లికేషన్లను ఈ నెలాఖరులోగా క్లియర్ చేయడంపై రెవెన్యూ ఆఫీసర్లు చర్యలు చేపట్టారు. పెండింగ్‌లో ఉన్న ధరణి అప్లికేషన్లను వారం రోజుల్లోగా పరిష్కరించాలని తెలంగాణ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ నవీన్ మిట్టల్ ఆదేశించారు. డేటా కరెక్షన్స్, మ్యుటేషన్, సక్సేషన్ లాంటి దరఖాస్తులు ఎక్కువగా పెండింగ్‌లో ఉండండంతో నిబంధనల ప్రకారం పరిష్కరించాలని తహశీల్దార్లకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది . వివిధ దశల్లో పెండింగ్ లో ఉన్న అప్లికేషన్లను ఈ నెలాఖరులోగా క్లియర్ చేయడంపై రెవెన్యూ ఆఫీసర్లు చర్యలు చేపట్టారు. గతంలో ధరణి ఆన్ లైన్ లాగిన్ కలెక్టర్ వద్ద మాత్రమే ఉండేది. అయితే ధరణిలో ఉన్న చాలా సమస్యల వల్ల రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
చిన్నపాటి తప్పులను ధరణి సైట్ లో సవరించే అధికారం మండల, డివిజన్ స్థాయి రెవెన్యూ ఆఫీసర్లకు ఉండేది కాదు. పేర్లతో తప్పు, రికార్డుల్లో భూ వివరాలు తప్పుగా ఎంట్రీ అవటం, భూమి హెచ్చు తగ్గులుగా చూపటం, ప్రొహిబిటేడ్ ల్యాండ్ గా చూపటం లాంటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ.. పెద్ద సంఖ్యలో రైతులు ఆఫీసర్లకు ఫిర్యాదులు చేశారు. జిల్లా కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణికి పదుల సంఖ్యలో రైతులు వచ్చి వినతులు ఇచ్చే వారు. వారాలు, నెలల తరబడి తిరిగిన ఫలితం లేకపోయేది. రికార్డులు, పట్టాదారు పాస్ బుక్ లో చిన్న పాటి పొరపాటును సరి చేయడానికి కూడా రైతులు యంత్రాంగం చుట్టూ, ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. అయినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ధరణి సమస్య పరిష్కారంపై ఫోకస్ పెట్టింది. పెద్ద సంఖ్యలో వినతులు ఉన్న దృష్ట్యా ఆర్డీవోలు, తహసీల్దార్లకు కూడా లాగిన్ ఇచ్చారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌తో రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది కుటుంబాలు భూ సమస్యలు ఎదుర్కొంటున్నాయంటోంది తెలంగాణ ప్రభుత్వం. ఆ సమస్యల నుంచి రిలీఫ కలిగించేందుకు ధరణి పోర్టల్‌ను పునర్‌వ్యవస్థీకరించి భూ సంబంధిత వ్యవహారాలను అందుకు సంబంధించిన చట్టాల్లో మార్పులు తేవాల్సిన మార్పులు అవసరం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. ఇక ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రెవెన్యూ వ్యవస్థలోని ధరణిని ప్రక్షాళన చేసేందుకు సత్వర చర్యలు తీసుకుంది. ఈ నేపథ్యంలోనే ధరణి పోర్టల్ అమలు కారణంగా వచ్చిన సమస్యలను అధ్యయనం చేయడానికి ఐదుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది ప్రభుత్వం.
ధరణి, ప్రజావాణి ఫిర్యాదులపై దృష్టి పెట్టి వెంటనే పరిష్కరించాలని కామారెడ్డి కలెక్టర్ ఆశిష్సంగ్వాన్ ఆఫీసర్లను ఆదేశించారు. గురువారం ఆర్డీవోలు, తహసీల్దారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ నెలాఖరులోగా ధరణి అప్లికేషన్లు క్లియర్ చేయాలన్నారు. రోజూ 40 నుంచి 50 అఫ్లికేషన్లను క్లియర్ చేయాలని, ఆర్డీవోలు, తహసీల్దార్‌లతో మానిటరింగ్ చేయాలని అడిషనల్ కలెక్టర్ చంద్రమోహన్‌కు సూచించారు. కుల, ఆదాయ, రెసిడెన్షియల్ సర్టిఫికెట్లను కూడా జారీ చేయాలన్నారు. సీఎం ప్రజావాణి ఫిర్యాదులకు ప్రయార్టీ ఇచ్చి పరిష్కరించాలన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com