TS CONGRESS: 20 తర్వాతే కాంగ్రెస్‌ అభ్యర్థుల జాబితా

TS CONGRESS: 20 తర్వాతే కాంగ్రెస్‌ అభ్యర్థుల జాబితా
X
100 సీట్లకు ఒక్క పేరే ... మరోసారి భేటీ కావాలని స్క్రీనింగ్‌ కమిటీ నిర్ణయం

తెలంగాణలో ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపికలో తలమునకలైంది. స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ నేతృత్వంలో ఢిల్లీలో కీలక సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి, మానిక్‌రావ్ ఠాక్రే, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీలు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మధుయాష్కీ, రోహిత్ చౌదరి, పీసీ విష్ణునాథ్ హాజరయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. రాబోయే ఎన్నికలకు సబంధించి అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్‌ తీవ్ర కసరత్తు చేస్తోంది. దీంతో అభ్యర్థుల్లో తీవ్ర ఉత్కంఠత నెలకొంది. ఒకే అభ్యర్థి ఉన్న నియోజకవర్గాల లిస్ట్‌ను స్క్రీనింగ్ కమిటీ ఫైనల్ చేసినట్లు సమాచారం. అభ్యర్థుల ఎంపికపై మరోసారి సమావేశం కావాలని కాంగ్రెస్ స్క్రీనింగ్‌ కమిటీ నిర్ణయించింది. కేంద్ర ఎన్నికల కమిటీకి జాబితాను పంపే ముందు ఇంకోసారి పున:పరిశీలన చేయనున్నట్లు తెలుస్తోంది.


ఇప్పటివరకు దాదాపు వంద నియోజకవర్గాల్లో ఏకాభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. ఎనిమిది గంటలపాటు సాగిన స్క్రీనింగ్‌ కమిటీ భేటీలో అభ్యర్థుల వడపోత పూర్తికాలేదు. వివిధ వర్గాల వినతుల పరిశీలనతోపాటు బయట పార్టీల నుంచి చేరికల దృష్ట్యా ఈ నెల 20వ తేదీ తర్వాతే అభ్యర్ధుల జాబితా వెల్లడించే అవకాశం ఉందని తెలంగాణ కాంగ్రెస్‌ వర్గాలు వెల్లడించాయి. తెలంగాణలో ఎన్నికల నిర్వహణకు ఈ వారంలో నోటిఫికేషన్‌ వెలువడే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అభ్యర్ధుల ఎంపికపై కాంగ్రెస్ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేకపోతోంది.


ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే అభ్యర్ధుల తొలి జాబితా ప్రకటించే అవకాశం లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అభ్యర్ధుల ఎంపికలో తలమునకలైన కాంగ్రెస్‌ పూర్తి పారదర్శకంగా ముందుకు వెళ్లాలన్న యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ఆర్నెళ్లుగా సర్వేలపై సర్వేలు నిర్వహిస్తూ వస్తోంది. పార్టీ పరంగానే కాకుండా నాయకుల వారీగా ఈ సర్వేలు చేయించినట్లు తెలుస్తోంది. ఏఐసీసీ పర్యవేక్షణలో జరిగిన సర్వేలతోపాటు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సర్వేలు, కాంగ్రెస్ రాజకీయ వ్యహకర్త సునీల్‌ కనుగోలు సర్వేలు, డీకే శివకుమార్‌ సర్వేతోపాటు స్థానిక నాయకత్వాలు కొన్ని సర్వేలు చేయించుకున్నట్లు సమాచారం. ఈ సర్వేల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చేందుకు సానుకూల వాతావరణం ఉన్నట్లు మాత్రమే వెల్లడైనట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలుస్తోంది.

గతంలో దాదాపు 65 నియోజక వర్గాలపై ఏకాభిప్రాయానికి వచ్చి సింగిల్‌ నేమ్‌ ప్రతిపాదన చేయగా.. తాజాగా మరో 35 నియోజకవర్గాలపై ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే దాదాపు వంద నియోజక వర్గాలల్లో అభ్యర్ధుల ఎంపిక దాదాపు కొలిక్కి వచ్చినప్పటికీ.. మరో 19చోట్ల అభ్యర్ధులు సరైనవారు లేరని తెలుస్తోంది. కేంద్ర ఎన్నికల కమిటీకి జాబితా పంపే ముందు మరొకసారి భేటీకావాలని స్క్రీనింగ్‌ కమిటీ నిర్ణయించింది.

Tags

Next Story