తెలంగాణ కొత్త సచివాలయ నిర్మాణ పనులు పరిశీలించిన మంత్రి వేముల

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న నూతన సెక్రటేరియట్ పనులను మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పరిశీలించారు. పనుల్లో పురోగతి అడిగి తెలుసుకున్నారు. నిర్మాణ ప్రాంగణం అంతా కలియతిరుగుతూ పలు సూచనలు చేశారు. అనంతరం ఆర్ అండ్ బి అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనల మేరకు ప్రపంచం అబ్బురపడేలా అన్ని వసతులు, అన్ని సౌకర్యాలతో ప్రజలకు మెరుగైన సెక్రటేరియట్ భవనం ఉంటుందన్నారు.
సెక్రటేరియట్ మెయిన్ బిల్డింగ్‌కు గుంతల తవ్వకాలు జరుగుతున్నాయని మంత్రి తెలిపారు. భూకంపాలను సైతం తట్టుకునే విధంగా, స్ట్రాంగ్‌గా నిర్మాణం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారన్నారు. వారి ఆదేశాలతో ఆర్కిటెక్ట్, స్ట్రక్చర్ ఇంజినీర్స్, ఐఐటీ ప్రొఫెసర్స్‌ను సంప్రదించి వెట్టింగ్ చేయించి మరి డిజైన్లు రూపొందించామన్నారు. భవనానికి దాదాపు 200 పిల్లర్లు ఉంటాయన్నారు. ఒక్క పిల్లర్‌కు 300 బస్తాలు సిమెంట్ అంటే 40 క్యూబిక్ మీటర్లు కాంక్రీటు, 4 టన్నుల స్టీల్ పడుతుందన్నారు. అంటే ఒక సామాన్యుడు ఇల్లు కట్టుకుంటే ఎంతైతే సిమెంట్, కాంక్రీటు, స్టీల్ పడుతుందో.. సెక్రటేరియట్ భవనం ఒక్క పిల్లర్‌కు సరిపోతుందన్నారు. దీన్ని బట్టి నిర్మాణం ఎంత స్ట్రాంగ్‌గా జరుగుతుందో అర్ధమవుతుందన్నారు.
నిర్మాణం క్వాలిటీలో ఎక్కడా రాజీ లేకుండా పనులు శరవేగంగా జరుగుతున్నాయని మంత్రి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ 12 నెలల్లో పూర్తి చేయాలని సూచించారని.. వారి ఆలోచనలకు అనుగుణంగా పూర్తి నాణ్యతతో చురుగ్గా పనులు జరుగుతున్నాయి. తెలంగాణ ఖ్యాతిని చాటే విధంగా నిర్మాణం ఉంటుందని భావిస్తున్నానని చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com