Telangana: తెలంగాణకు మరో భారీ పెట్టుబడి.. కేటీఆర్ సమక్షంలో అవగాహన ఒప్పందం..

Telangana: తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి దక్కింది. తాజాగా ఆశీర్వాద్ పైప్స్ గ్రూప్ తెలంగాణలో ఐదు వందల కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టనున్నట్లు ప్రకటించింది. తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో దావోస్‌లోని తెలంగాణ పెవిలియన్‌లో అవగాహన ఒప్పందం జరిగింది. అలియాక్సిస్ కంపెనీ సీఈఓ కోయిన్ స్టికర్.. మంత్రి కేటీఆర్‌తో సమావేశం అయ్యారు.
తెలంగాణలో ఏర్పాటు చేయనున్న తయారీ ప్లాంట్ ద్వారా స్టోరేజ్, ఫిట్టింగ్స్ వంటి ప్లాస్టిక్ ఉత్పత్తులను ఉత్పత్తి చేయనున్నట్లు కంపెనీ సీఈవో తెలిపారు. ఇతర దేశాల కోసం సైతం తెలంగాణ నుంచి తయారు చేయడమే లక్ష్యంగా తమ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు . తెలంగాణలో తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిన ఆశీర్వాద్ పైప్స్‌కు మంత్రి కేటీఆర్ ఆహ్వానం పలికారు.
కంపెనీ ఏర్పాటు చేయనున్న తయారీ ప్లాంట్ ద్వారా ఐదు వందల మందికి ప్రత్యక్ష ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని కేటీఆర్ తెలిపారు. తెలంగాణలో ప్లాస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగానికి తమ ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని.. ఆశీర్వాద్ పైప్స్ పెట్టుబడి ద్వారా ఈ రంగంలో మరిన్ని ఉత్పత్తులు.. పెట్టుబడులు తెలంగాణకు వస్తాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కంపెనీ ఏర్పాటు చేస్తున్న తయారీ ప్లాంట్ కోసం అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తామని హామీ ఇచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com