తెలంగాణలో భానుడి భగభగలు.. రాష్ట్రంలో 42 డిగ్రీలకు చేరిన గరిష్ట ఉష్ణోగ్రతలు..!

తెలంగాణలో భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. దీంతో రోజురోజుకు పెరుగుతున్న ఎండలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. అనేక చోట్ల పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటుతున్నాయి. ఎండకు తోడు ఉక్కపోతతో సతమతమవుతున్నారు. మధ్యాహ్నం వేళ బయటకు రావాలంటేనే జంకుతున్నారు. దీంతో హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో రోడ్లపై జనం పలుచగా కనిపిస్తున్నారు. ఏప్రిల్, మే నెలల్లో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆదివారం అత్యధికంగా మంచిర్యాల జిల్లా నస్పూర్‌లో 42.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్‌లోని నారాయణగూడలో 39.4 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయ్యింది. 14 జిల్లాల్లో 40 డిగ్రీలకుపైగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఉష్ణోగ్రతల పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు TSDPS ఆధ్వర్యంలో 589 మండలాల్లో వెయ్యికిపైగా ఆటోమేటెడ్ వెదర్ స్టేషన్లు ఏర్పాటుచేశారు. ఈ స్టేషన్లు గంటకోసారి ఉష్ణోగ్రతల వివరాలను తెలియజేస్తున్నాయి. గ్రామ స్థాయి వరకు వాతావరణ వివరాలను తెలిపేందుకు ప్రభుత్వం TS WEATHER మొబైల్ యాప్‌ను రూపొందించింది. జిల్లా కలెక్టర్ కార్యాలయాలు, హైదరాబాద్‌లోని ప్రముఖ ప్రాంతాల్లో వాతావరణ వివరాలు తెలిపేందుకు ఎల్‌ఈడీ తెరలను కూడా ప్రభుత్వం ఏర్పాటుచేసింది.
పగటిపూట తప్పనిసరిగా బయటకు వెళ్లాల్సి వస్తే వడదెబ్బ తగలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఎక్కువగా నీళ్లు తాగుతూ.. డిహైడ్రేషన్ బారి నుంచి కాపాడుకోవాలని చెబుతున్నారు. దాహం తీర్చుకునేందుకు కొబ్బరి బోండాలు, మజ్జిగ లాంటివి తీసుకోవడం మంచిదని.. మసాలా పదార్ధాలకు వీలైనంత దూరంగా ఉండాలన్నారు. సాధ్యమైనంత వరకు మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు వెళ్లకుండా ఇళ్లలోనే ఉండాలని అంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com