TG: నేడు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ

తెలంగాణ సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు సర్వం సిద్ధమైంది. సచివాలయంలో నేడు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. సాయంత్రం 6:05 గంటలకు సచివాలయ ప్రాంగణంలో ముఖ్యమంత్రి ఆవిష్కరించనున్నారు. ఈ ఉత్సవం సందర్భంగా రాష్ట్ర గీతం ‘జయ జయహే తెలంగాణ జననీ జయ కేతనం’ ఆలాపన జరగనుంది. విగ్రహ శిల్పి రమణారెడ్డికి, జయ జయహే గీత రచయిత అందెశ్రీకి సన్మానం చేస్తారు. గద్దర్, గూడ అంజన్న వంటి కళాకారుల త్యాగాలకు గుర్తుగా ప్రకటన చేసే అవకాశం ఉంది.
ఏటా డిసెంబర్ 9న తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవం
సచివాలయంలో నేడు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న సమయంలో ఏటా డిసెంబరు 9న తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డి శాసనసభలో ప్రకటన చేయనున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి తొలి ప్రకటన 2009 డిసెంబరు 9న వెలువడింది. దీంతో ఆ రోజును పండుగలా నిర్వహించాలని రేవంత్ సర్కారు నిర్ణయించింది. అసెంబ్లీ శీతాకాల సమావేశాలు సోమవారం ఉదయం 10.30 గంటలకు ప్రారంభం కానుండగా.. తొలి రోజు సమావేశంలోనే తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవంపై ముఖ్యమంత్రి కీలక ప్రకటన చేయనున్నారు. దీంతోపాటు విగ్రహం రూపకల్పన తదితర అంశాలపైనా ప్రకటన చేస్తారు. అనంతరం ఆ ప్రకటనపై సభలో చర్చ జరగనుంది. చర్చ ముగిసిన తర్వాత తెలంగాణ తల్లి ఉత్సవాల నిర్వహణపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది.
సోనియాకు జన్మదిన కానుక..!
ఏఐసీసీ అగ్రనేత సోనియాగాంధీ జన్మదినాన్ని పురస్కరించుకుని 2009లో అప్పటి యూపీఏ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన చేసిన సంగతి తెలిసిన విషయమే. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియాగాంధీనే తెలంగాణకు తల్లి అంటూ కాంగ్రెస్ ముఖ్య నాయకులు ప్రకటనలు కూడా చేస్తుంటారు. తాజాగా సోనియాగాంధీ పుట్టిన రోజున తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించి.. ఏటా అదే రోజున ఉత్సవాలు నిర్వహించాలన్న నిర్ణయానికి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రావడం ఒక రకంగా ఆమెకు ఇస్తున్న జన్మదిన కానుకేనని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com