BREAKFAST: తెలంగాణ స్కూళ్లలో నేటి నుంచే అల్పాహారం

BREAKFAST: తెలంగాణ స్కూళ్లలో నేటి నుంచే అల్పాహారం
రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించనున్న ప్రజా ప్రతినిధులు.. మారేడుపల్లిలో ప్రారంభించనున్న కేటీఆర్‌

తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా అల్పాహారాన్ని అందించేందుకు ఉద్దేశించిన 'ముఖ్యమంత్రి అల్పాహార పథకం నేడు ప్రారంభంకానుంది. పాఠశాల సమయం కంటే 45 నిమిషాల ముందే విద్యార్థులకు అల్పాహారాన్ని కేసీఆర్‌ ప్రభుత్వం వడ్డించబోతోంది. సికింద్రాబాద్ వెస్ట్ మారేడుపల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో మంత్రి కేటీఆర్, రంగారెడ్డి జిల్లా రావిర్యాల ఉన్నతపాఠశాలలో మంత్రులు హరీశ్ రావు, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. ప్రతీ నియోజకవర్గంలో ఒక పాఠశాలలో మంత్రులు, శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు.


ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థినీవిద్యార్థులకు ఉచితంగా అల్పాహారాన్ని అందించనున్నారు. విద్యార్థులకు పౌష్టికాహారంతో పాటు డ్రాపౌట్లను తగ్గించి, హాజరు శాతాన్ని పెంచడానికి ఈ పథకం ఉపయోగపడనుంది. 27 వేల 147 పాఠశాలల్లోని దాదాపు 23 లక్షల మంది విద్యార్థులకు ఈ పథకం ద్వారా తెలంగాణ ప్రభుత్వం అల్పాహారాన్ని అందించనుంది. సోమవారం ఇడ్లీ సాంబార్‌ లేదా గోధుమ రవ్వ, మంగళవారం పూరీ ఆలూకుర్మా లేదా టామటా బాత్, బుధవారం ఉప్మా సాంబరు లేదా బియ్యంతో చేసిన రవ్వ కిచిడి, గురువారం చిరుధాన్యాలతో చేసిన ఇడ్లీ సాంబార్‌ లేదా పొంగల్ సాంబార్‌, శుక్రవారం ఉగ్గాని లేదా చిరుధాన్యాల ఇడ్లీ లేదా గోధుమ రవ్వ కిచిడి, శనివారం పొంగల్ సాంబార్‌ లేదా కూరగాయలతో చేసిన పులావ్‌ను విద్యార్థులకు అల్పాహారంగా అందించనున్నారు.

ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం అందిస్తున్న ప్రభుత్వం చిరుధాన్యాలతో కూడిన అల్పాహారాన్ని నేటి నుంచి అందించబోతుంది. ఈ పథకం అమలుతీరును పర్యవేక్షించే బాధ్యతను పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్లు, గ్రామీణ ప్రాంతాల్లో జిల్లా అదనపు కలెక్టర్లకు అప్పగించారు.

Tags

Read MoreRead Less
Next Story