ఏసీబీకి పట్టుబడ్డ తెలంగాణ వర్సిటీ వీసీ రవీందర్‌ గుప్తా

ఏసీబీకి పట్టుబడ్డ తెలంగాణ వర్సిటీ వీసీ రవీందర్‌ గుప్తా
50వేల లంచం తీసుకుంటుండగా రవీందర్‌ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు

తెలంగాణ యూనివర్సిటీ వీసీ రవీందర్‌ గుప్తాను ఏసీబీ అరెస్ట్‌ చేసింది. హైదరాబాద్‌ తార్నాకలోని నివాసంలో 50వేల లంచం తీసుకుంటుండగా.. రవీందర్‌ను.. ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నియామకాలు, నిధుల వినియోగంలో గోల్‌మాల్ జరిగినట్లుగా గుర్తించారు. దీంతో ఆయన నివాసంలో సోదాలు చేపట్టారు. అటు.. యూనివర్సిటీలోని వీసీ ఛాంబర్‌లోనూ తనిఖీలు నిర్వహించారు. దాదాపు 8 గంటల పాటు సోదాలు నిర్వహించిన అనంతరం రవీందర్‌ను ఏసీబీ అరెస్ట్‌ చేసింది.

నిజామాబాద్‌ జిల్లాలో ఎగ్జామ్‌ సెంటర్‌ కోసం ఓ ప్రైవేట్‌ డిగ్రీ కళాశాల నిర్వాహకుల వద్ద.. రవీందర్‌ లంచం తీసుకుంటుండగా పట్టుకున్నామని.. ఏసీబీ డీఎస్పీ సుదర్శన్‌ తెలిపారు. అంతేకాకుండా యూనివర్సిటీలో నియామకాల విషయంలో అవకతవకలకు పాల్పడ్డారని.. నిధుల దుర్వినియోగంపై కూడా ఆరోపణలు ఉన్నాయన్నారు. ఇటీవలే తెలంగాణ యూనివర్సిటీలో విజిలెన్స్‌ అధికారులు సోదాలు నిర్వహించారు. అకౌంట్స్‌, ఏవో, ఎస్టాబ్లిష్‌మెంట్‌ సెక్షన్లలో తనిఖీలు చేపట్టారు.

తెలంగాణ యూనివర్సిటీలో విద్యార్థులు సంబరాలు చేసుకున్నారు. బాణాసంచా కాల్చారు. రవీందర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వీసీ వ్యవహారంలో సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్‌ చేశారు. ఇక.. గత కొన్ని రోజులుగా తెలంగాణ యూనివర్సిటీలో గందరగోళం నెలకొంది. రిజిస్ట్రార్‌ నియామకం విషయంలో వార్‌ నడిచింది. దీంతో వీసీ వెనక్కు తగ్గారు. రిజిస్ట్రార్‌గా ప్రొఫెసర్‌ యాదగిరిని నియమిస్తూ వీసీ రవీందర్‌ ఉత్తర్వులు ఇచ్చారు. ఇంతలో ఆయన ఏసీబీకి చిక్కాడు.

Tags

Read MoreRead Less
Next Story