కరోనాతో మరో జర్నలిస్ట్ మృతి...!

దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. కరోనా ధాటికి ఇప్పటికే చాలా మంది జర్నలిస్ట్ బలైపోతున్నారు. తాజాగా మరో జర్నలిస్ట్ ను కరోనా బలి తీసుకుంది. వివిధ టెలివిజన్ చానెళ్లలో బిజినెస్ జర్నలిస్టుగానూ, కొన్ని సంస్థల్లో సెంట్రల్ డెస్కులోనూ పనిచేసిన పామర్తి పవన్ కుమార్ (38) శుక్రవారం తెల్లవారుజామున కోవిడ్ తో మృతి చెందారు. ఆయనకు కోవిడ్ సోకిన తరువాత చికిత్స తీసుకుంటుండగా, ఆక్సిజన్ స్థాయి తగ్గడంతో బుధవారం కృష్ణా జిల్లా వుయ్యూరులోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు.
అయితే అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం విజయవాడ లేదా హైదరాబాద్ లోని ఆసుపత్రికి తరలించడం కోసం ప్రయత్నాలు జరిగాయి. ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయనీ, మెరుగైన ఆసుపత్రిలోచికిత్స అందించాలని స్థానిక వైద్యులు సూచించారు. అప్పటి వరకూ ఆక్సిజన్ అందించారు. అయితే శుక్రవారం ఏదైనా ఆసుపత్రిలో అడ్మిషన్ కోసం ప్రయత్నం చేసే లోపు, తెల్లవారుఝామను అకస్మాత్తుగా ఆక్సిజన్ స్థాయి పడిపోయి, తుది శ్వాస విడిచారు. పవన్ కుమార్ పలు మీడియా ఛానల్స్ లలో పనిచేశారు.
తన కథనాలకు ప్రతిష్టాత్మక జాతీయ స్థాయి నేషనల్ టెలివిజన్ అవార్డు సహా పలు అవార్డులు పొందారు. అంతకు సుమారు 20 రోజుల క్రితమే ఆయన తండ్రి కరోనాతో మరణించారు. ఆయన స్వస్థలం కృష్ణా జిల్లా మొవ్వ మండలం గూడపాడు గ్రామం. ఆయనకు భార్య మధు శ్రావణి, పదేళ్ల లోపు వయసున్న ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com