LOCAL BODYS: స్థానిక ఎన్నికలు.. రిజర్వేషన్ల టెన్షన్

LOCAL BODYS: స్థానిక ఎన్నికలు.. రిజర్వేషన్ల టెన్షన్
X
రిజర్వేషన్లు ఎలా ఉంటాయో అన్న ఉత్కంఠ... నోటిఫికేషన్ జారీకి సిద్ధమవుతున్న ఎన్నికల సంఘం

తెలంగాణలో ఈ నెలలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. దీంతో గ్రామాల్లో స్థానిక ఎన్నికల సందడి నెలకొంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలకు చెందిన ఆశవాహులు ఇప్పటికే సర్పంచ్‌ అభ్యర్థిత్వం కోసం మంతనాలు జరుపుతున్నారు. తమకు ఈసారి అవకాశం ఇవ్వాలని గ్రామాల్లోని కొందరు ఆయా పార్టీల ముఖ్యులను కోరుతున్నారు. ఇప్పటికే పల్లెలలో ఎన్నికల వాతావరణం మొదలైంది. అయితే స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ త్వరలోనే విడుదల కానుండటంతో రిజర్వేషన్లు ఎలా ఉంటాయోనని ఆశావాహుల్లో ఉత్కంఠ నెలకొంది. గత ప్రభుత్వం రెండు దశలు కొనసాగేలా రిజర్వేషన్లను ఖరారు చేయగా, వాటిని అధికార కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసి కొత్తగా రిజర్వేషన్లను ఖరారు చేసింది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచుల స్థానాలకు సంబంధించిన రిజర్వేషన్లు ఎలా ఉంటాయోనని, పోటీ చేయాలన్న ఆశతో ఉన్న నాయకులు ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు.

కనిపించని గులాబీ మెరుపులు

ఇప్పటికే రానున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు BJP, కాంగ్రెస్ తమ అభ్యర్థులను ప్రకటించినా BRS మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు ఉందని నేతలంటున్నారు. మరో వారంలో స్థానిక ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉన్నట్టు రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయినా BRS గ్రామస్థాయిలో దిశానిర్దేశం చేయడం లేదని, సోషల్ మీడియా పోస్ట్‌లు, ట్విట్టర్‌లో స్పందనలు, ప్రెస్ మీట్‌లతోనే కాలం గడుపుతుందని కేడర్ మండిపడుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహంపై చర్చిస్తున్నామని బీఆర్‌ఎస్ నేతలు చెప్తున్నారు.

ఏకగ్రీవాలకు ఈసీ చెక్!

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇకపై రాష్ట్రంలో ఏకగ్రీవాలు లేకుండా చర్యలు తీసుకోనుందట. ఒక్క నామినేషన్ నమోదైనా ‘నోటా’ను రెండో పోటీదారుగా పేర్కొంటూ ఎన్నిక నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ విధానం హర్యానా, మహారాష్ట్రలో అమల్లో ఉంది. దీనిపై ఈ నెల 12న రాజకీయ పార్టీలతో చర్చించి తుది నిర్ణయం తీసుకోనుందని సమాచారం.

Tags

Next Story