KCR: డీజీపీకి కేసీఆర్ ఫోన్

KCR:  డీజీపీకి కేసీఆర్ ఫోన్
X
తెలంగాణలో జన్వాడ ఫామ్‌హౌస్ కేసు రచ్చ... బీఆర్‌ఎస్ నేతల అరెస్ట్‌

జన్వాడ ఫామ్‌హౌస్ ఘటనపై మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పందించారు. రాజ్ పాకాల , శైలేంద్ర పాకాల ఇళ్లల్లో సోదాలపై డీజీపీకి కేసీఆర్ ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. ఎలాంటి సెర్చ్ వారెంట్ లేకుండా సోదాలు ఎందుకు చేస్తున్నారని కేసీఆర్ ప్రశ్నించారు. సోదాలు వెంటనే ఆపాలని డీజీపీని కేసీఆర్ కోరారు. ఓరియన్ విల్లాస్ రాజ్ పాకాల విల్లాలో తాళాలను మోకిలా పోలీసులు పగలగొడుతున్నారు. కేసీఆర్ ఫోన్ చేయడంతో ఈ వివాదం ఇప్పుడు మరింత చర్చనీయాంశంగా మారింది.


రాజ్ పాకాల విల్లా వద్ద ఉద్రిక్తత...

రాజ్ పాకాల సోదరుడు శైలేంద్ర పాకల ఫామ్‌హౌస్‌ వద్ద బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగడం ఉద్రిక్తతతకు దారితీసింది. జాయింట్ కమిషనర్ ఎక్సైజ్ ఖురేషి నేతృత్వంలో సోదాలు నిర్వహించడానికి వచ్చారు. అయితే ఎక్సైజ్ శాఖ సోదాలను బీఆర్ఎస్ నేతలు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్, ఎమ్మెల్యే వివేక్, బాల్క సుమన్, సంజయ్‌తో పాటు బీఆర్‌ఎస్ కార్యకర్తలు భారీగా విల్లా వద్దకు చేరుకున్నారు. సెర్చ్ వారెంట్ లేకుండా ఎలా తనిఖీ చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పోలీసులు, బీఆర్ఎస్ నేతల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో బీఆర్ఎస్ నేతలు వివేకానంద, బాల్క సుమన్ సహా పలువురు నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఎక్సైజ్ అధికారులు.. రాజేంద్రప్రసాద్ విల్లాలో తనిఖీలు చేపట్టారు. తమ న్యాయవాది సమక్షంలో సెర్చ్ చేయాలని బీఆర్ఎస్ నేతలు వాదనలు వినిపించారు. ఎక్సైజ్ పోలీసులు జేబులు తనిఖీ చేశాక లోపలకు పంపిస్తామని కార్యకర్తలు నినాదాలు చేశారు. ఫామ్‌హౌస్‌‌‌లో సోదాలు చేయొద్దని గులాబీ శ్రేణులు నినాదాలు చేస్తూ పోలీసులను అడ్డుకున్నాయి. దీంతో పోలీసులకు, గులాబీ శ్రేణులకు మధ్య వాగ్వాదం జరిగింది.

డీసీపీ ఏం అన్నారంటే...

మోకిలా ఫామ్‌హౌస్ కేసు విచారణ జరుగుతుందని సైబరాబాద్ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. మొకిలా ఫామ్‌హౌస్‌పై ఎస్‌వోటీ ఎక్సైజ్ పోలీసులు దాడి చేశారని తెలిపారు. రాజ్ పాకాల ఫామ్‌హౌస్‌లో 21మంది పురుషులు, 14మంది మహిళలను గుర్తించినట్లు చెప్పారు. విదేశీ మద్యంతో పాటు గేమింగ్ సంబంధిత అంశాలు గుర్తించినట్లు వివరించారు. గేమింగ్ సంబంధిత అంశాలపై విచారణ జరుగుతుందని అన్నారు. పురుషులకు డ్రగ్ పరీక్షలు నిర్వహించామని ఒకరికి కొకైన్ పాజిటివ్ వచ్చిందని తెలిపారు.. విజయ్ మద్దూర్‌కి పాజిటివ్ రావడంతో రక్త పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. తెలంగాణ గేమింగ్ యాక్ట్ సెక్షన్ 3&4 ప్రకారం రాజ్‌పాకాల, విజయ్ మద్దూరిపై మోకిలా పీఎస్‌లో కేసు నమోదు చేశామని తెలిపారు. రాజ్ పాకాల ఫామ్‌హౌస్‌లో రేవ్ పార్టీకి అనుమతి లేనందున ఆయనపై ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్ అధికారులు ఎక్సైజ్ చట్టం 34 A, (1) ,R/W 9 కింద కేసు నమోదు చేశారని తెలిపారు.

Tags

Next Story