TERROR: ఆముదంతో విషం తయారు చేసి వందలమందిని చంపే కుట్ర

గుజరాత్లో భారీ ఉగ్ర కుట్రకు ప్రయత్నించిన సయ్యద్ అహ్మద్ మొహియుద్దీన్‌తో పాటు మరో ఇద్దరు ఐసిస్ సానుభూతిపరులను గుజరాత్ ఏటీఎస్ పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఈ విచారణలో సంచలన విషయాలు బహిర్గతమయ్యాయి. మొహియుద్దీన్ తన ఇంటినే ప్రయోగశాలగా మార్చి ఆముదం గింజలను ప్రాసెస్ చేసిన తర్వాత మిగిలిపోయిన వ్యర్థాల నుంచి ప్రమాదకరమైన రైసిన్ అనే విష రసాయనాన్ని తయారుచేయటం కలకలం సృష్టించింది. అంతేగాక అతడు రద్దీగా ఉండే ఫుడ్ మార్కెట్లను పరిశీలించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ జాబితాలో దిల్లీలోని ఆజాద్‌పుర్ మండీ, అహ్మదాబాద్ నరోడా ఫ్రూట్ మార్కెట్, లఖ్‌నవూలోని ఆర్ఎస్ఎస్ కార్యాలయం ఉన్నట్లు సమాచారం. ఈ ప్రాంతాల్లో రద్దీ, ప్రజా కార్యకలాపాలు ఎక్కువగా ఉండటం వల్లే వాటిని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. నిందితులు హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్, ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఆజాద్ సులేమాన్ షేక్, మొహమ్మద్ సుహెల్ సలీంఖాన్లుగా గుజరాత్ ఏటీసీ పేర్కొంది. వీరిని మరింత లోతుగా విచారించనున్నారు. డాక్టర్ అహ్మద్ మొహియుద్దిన్ సయ్యద్, ఆజాద్ సులేమాన్ షేక్, మొహమ్మద్ సుహేల్ మొహమ్మద్ సలీం ఖాన్ అనే ఈ ముగ్గురికి.. ఐసిస్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. టెలీగ్రామ్ ద్వారా వీరు ఐసిస్ హ్యాండ్లరతో టచ్‌లో ఉన్నారు. పాకిస్థాన్ ఉగ్రవాదులతోనూ వీరు సంబంధాలు కొనసాగిస్తున్నారు. వీరిపై ఏడాది కాలంగా నిఘా ఉంచిన భద్రతా బలగాలు.. ఆయుధాల కోసం గుజరాత్‌కు వచ్చిన సందర్భంలో అదుపులోకి తీసుకున్నారు.
ఈ ముగ్గురిలో హైదరాబాద్‌కు చెందిన అహ్మద్ మొహియుద్దీన్.. చైనాలో ఎంబీబీఎస్ చదివినట్లు ఏటీఎస్ అధికారులు గుర్తించారు. అబు ఖాదీమ్ అనే ఇస్లామిక్ స్టేట్ - ఖోరాసన్ ప్రావిన్స్ (ఐఎస్కేపీ) ఉగ్రవాదితో అతడు టచ్‌లో ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. రైసిన్ను తయారు చేసిన హైదరాబాద్ ఉగ్రవాది.. దాన్ని ప్రయోగించడానికి పాకిస్థాన్ నుంచి ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నట్లు ఏటీఎస్ అధికారులు తెలిపారు. మొహియుద్దీన్ గతంలో రెస్టారెంట్ బిజినెస్ చేశాడు. అక్కడే ఆముదం గింజలను ఉంచేవాడని.. వాటిని రైసిన్ తయారీకి వాడినట్లు అధికారులు చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

