TERROR:పాక్ ఐఎస్ఐతో నిరంతర సంప్రదింపులు

పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ (ISI) మద్దతున్న ఒక ముఠాతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్న జయీద్‌ఖాన్ అనే 22 ఏళ్ల యువకుడిని హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని ఘాజియాబాద్‌కు చెందిన 22 ఏళ్ల జయీద్ ఖాన్ ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉపాధి కోసం హైదరాబాద్ నగరానికి వచ్చాడు. అనంతరం మేడ్చల్ ప్రాంతంలోని ముబారక్ రెస్టారెంట్లో సర్వర్‌గా ఉద్యోగంలో చేరాడు. ఉద్యోగ సమయం మినహా మిగిలిన సమయంలో సోషల్ మీడియాలో చురుకుగా ఉండే అతడు, ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ రూపొందించి పోస్టు చేస్తుండేవాడు. ముఖ్యంగా రెండు బొమ్మ తుపాకులతో చేసిన వీడియోలకు మంచి స్పందన రావడంతో అదే తరహా వీడియోలను మరింతగా రూపొందించడం ప్రారంభించినట్లు పోలీసులు గుర్తించారు.
కీలక ఆధారాలు లభ్యం
ఇలాంటి వీడియోలే పాకిస్థాన్‌కు చెందిన ఐఎస్ఐ సానుభూతిపరుల దృష్టిని ఆకర్షించినట్లు దర్యాప్తులో తేలింది. హబీబ్, రాణా హుస్సేన్ అనే వ్యక్తులు మొదట అతడి పోస్టులకు లైక్‌లు, కామెంట్లు చేస్తూ పరిచయం పెంచుకున్నారు. తర్వాత ఐఎస్ఐ కీలక సభ్యుడిగా భావిస్తున్న షహబాద్ ఆదేశాల మేరకు ఇన్స్టాగ్రామ్ ద్వారా నేరుగా అతడితో సంభాషణలు ప్రారంభించినట్లు అధికారులు వెల్లడించారు. మొదట స్నేహపూర్వకంగా మాట్లాడిన వారు, ఆ తర్వాత అసలైన ఆయుధాలు పంపిస్తామని ఆశ చూపిస్తూ అతడిని ప్రభావితం చేసేందుకు ప్రయత్నించినట్లు విచారణలో బయటపడింది. ప్రాథమిక విచారణలో జయీద్ ఖాన్ కూడా వారికి ఆకర్షితుడై, అవకాశం వస్తే పాకిస్థాన్‌కు కూడా రావడానికి సిద్ధమని చాటింగ్‌లో పేర్కొన్నట్లు అధికారులు తెలిపారు. ఇదే సమయంలో అతడి సోషల్ మీడియా కార్యకలాపాలు, అనుమానాస్పద కదలికలను కేంద్ర భద్రతా సంస్థలు గమనించి మేడ్చల్ పోలీసులను అప్రమత్తం చేశాయి. పోలీసులు జయీద్ ఖాన్‌ను అదుపులోకి తీసుకుని అతడి గదిని తనిఖీ చేశారు. అక్కడ రెండు నకిలీ తుపాకులు, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ఫోన్ పరిశీలనలో ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి పాక్ ఐఎస్ఐ ముఠా సభ్యులతో జరిగిన వాట్సాప్ చాటింగ్‌లు, వాయిస్ కాల్స్, స్క్రీన్షాట్లు లభించినట్లు అధికారులు తెలిపారు. మరిన్ని వివరాల కోసం మొబైల్ ఫోన్‌ను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించారు. కోర్టు అతడికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో చర్లపల్లి జైలుకు తరలించారు. పాక్ ఐఎస్ఐతో సంబంధాల తీవ్రత, ఇతర ఉగ్రవాద సంస్థలతో ఎలాంటి అనుబంధం ఉందా అనే అంశాలపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
