TG: తెలంగాణ రాజకీయాల్లో బీసీ రిజర్వేషన్ల రచ్చ

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌పై హైకోర్టు స్టే ఇస్తూ జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులు సరికొత్త చర్చకు దారి తీశాయి. బీసీలకు 42% రిజర్వేషన్లు కేటాయిస్తూ.. ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 9కి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై రెండు రోజుల పాటు వాదనలు విన్న హైకోర్టు తుది నిర్ణయం వెల్లడించింది. దీని ప్రకారం జీవో 9 పై స్టే విధించింది. ఇదిలా ఉండగా ఎన్నికల సంఘం ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్, వార్డు మెంబర్ల ఎన్నికలు నిర్వహించేందుకు ఇదివరకే షెడ్యూల్ జారీ చేసింది. ఈ మేరకు జీవో నంబర్ 9 ప్రకారమే రిజర్వేషన్లను ఖరారు చేసింది.
హైకోర్టు స్టే ఊహించలేదు: పొన్నం
జీవో నెంబర్ 9 పై హైకోర్టు స్టే విధిస్తుందని తాము ఊహించలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల కాపీ అందిన తర్వాత చట్టపరంగా, న్యాయపరంగా భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. ప్రభుత్వం తరఫున బలమైన వాదనలు వినిపించడం జరిగిందని చెప్పారు. బీఆర్ఎస్, బీజేపీలు హైకోర్టులో ఎందుకు ఇంప్లీడ్ కాలేదో సమాధానం చెప్పాలన్నారు. రాహుల్ నాయక్వతంలో సామాజిక న్యాయంతో ఎన్నికలకు వెళ్లామన్నారు. బీసీ రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నామన్నారు.
స్టే దురదృష్టకరం: బీర్ల ఐలయ్య
స్థానిక ఎన్నికలపై హైకోర్టు స్టే దురదృష్టకరమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి అన్ని ప్రయత్నాలు చేశారన్నారు. కానీ, కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో ప్రతిపక్షాలు సహకరించకపోవడం వల్లే బీసీల నోటికాడి ముద్ద గుంజుకున్నారన్నారు. బీసీ బిడ్డలు ఎవ్వరూ నిరాశ చెందొద్దన్నారు. రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం పోరాటం చేస్తుందని తెలిపారు. రిజర్వేషన్లు వచ్చే వరకు పోరాడతామన్నారు.
'రేవంత్ ఇప్పటికైనా డ్రామాలు ఆపండి'
బీసీ రిజర్వేషన్ల స్టేపై మాజీ మంత్రి హరీశ్‌రావు స్పందించారు. ఆరు గ్యారెంటీల లాగే, బీసీల 42 శాతం రిజర్వేషన్లు కూడా కాంగ్రెస్ ఆడిన డ్రామా అని విమర్శించారు. 55 ఏళ్లు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఏనాడైనా బీసీ రిజర్వేషన్ల ప్రయత్నం చేసిందా అని ప్రశ్నించారు. బీసీలకు మాయమాటలు చెప్పి స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ లబ్ది పొందాలని భావించిందన్నారు. రేవంత్ ఇప్పటికైనా డ్రామాలు ఆపాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం.. బీసీలను మోసం చేస్తోందని హరీశ్‌రావు మండిపడ్డారు.
కాంగ్రెస్ మోసం బయటపడింది: కేటీఆర్
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు, 42 శాతం బీసీ రిజర్వేషన్లపై తెలంగా హైకోర్టు స్టే విధించడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ స్పందించారు. బీసీ రిజర్వేషన్ల పేరిట కాంగ్రెస్ మోసం తేటతెల్లమైందని అన్నారు. ఇన్నాళ్లపాటు అడ్డగోలు విధానాలతో 42 శాతం హామీ తుంగలో తొక్కారని విమర్శించారు. ఇప్పుడు మరోసారి రేవంత్ రెడ్డి బీసీలను దారుణంగా మోసం చేశారని ఆరోపించారు. న్యాయస్థానంలో నిలబడని జీఓతో మభ్యపెట్టారని చెప్పారు. కేంద్రంలోని బీజేపీ కూడా బీసీలను వెన్నుపోటు పొడిచిందని తెలిపారు. ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకతను కాంగ్రెస్ పార్టీ ఎదుర్కోలేక.. ఎన్నికల వాయిదా కోసం బీసీ రిజర్వేషన్ల అంశాన్ని వాడుకుందని కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం తప్పదని కేటీఆర్ హెచ్చరించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com