TG: తెలంగాణలో ఉద్యోగుల పనివేళలు మార్పు

తెలంగాణలోని వాణిజ్య కేంద్రాల్లో ఉద్యోగుల పని వేళల పరిమితిపై రేవంత్రెడ్డి ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఉన్న ఉద్యోగుల పనివేళల పరిమితిని సవరించింది. వాణిజ్య కేంద్రాల్లోని ఉద్యోగులు రోజుకు 10 గంటల వరకు పని చేసేందుకు అనుమతించింది. అదే సమయంలో వారంలో పని వేళలు 48 గంటలు మించరాదని స్పష్టం చేసింది. ఈ పరిమితి దాటితే ఉద్యోగులకు ఓవర్ టైమ్ వేతనం చెల్లించాలని తెలిపింది. రోజులో 6 గంటల్లో కనీసం అరగంట విశ్రాంతి ఇవ్వాలని, విశ్రాంతితో కలిపి 12 గంటల కంటే ఎక్కువ పని చేయించరాదని కూడా తెలంగాణ సర్కార్ పేర్కొంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో భాగంగా పనివేళలు సవరించినట్లు ప్రభుత్వం తెలిపింది. అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా పని గంటలకు సంబంధించిన చర్చ సాగుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు కొందరు దిగ్గజ పారిశ్రామికవేత్తలు రోజుకు 12 గంటలపైనే పని చేయాలని కూడా వాదిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com