TG: కాంగ్రెస్ మంత్రుల మధ్య ముగిసిన వివాదం

కొన్ని రోజులుగా తెలంగాణలో మంత్రుల మధ్య నడుస్తున్న వివాదం ఎట్టకేలకు ముగిసింది. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నివాసంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ భేటీ అయి కీలక చర్చలు జరిపారు. అనంతరం పొన్నం క్షమాపణలు చెప్పడంతో ఈవివాదానికి తెరపడింది.తన గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారని, మంత్రి పొన్నం క్షమాపణలు చెప్పాలని మరోమంత్రి అడ్లూరి లక్ష్మణ్ డిమాండ్ చేశారు. అయితే ఈ వివాదం చిలికి చిలికి గాలివానలా అయ్యేలా కనిపించింది. దీంతో టీపీసీసీ ఎంట్రీ ఇచ్చింది. టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ ఇంట్లో ఇద్దరు మంత్రులు సమావేశం అయ్యారు. మహేశ్ గౌడ్ చొరవతో మంత్రులు మధ్య వివాదం ముగిసింది.ఈ సమావేశంలో పొన్నం, అడ్లూరి, మహేశ్ గౌడ్తోపాటుగా మంత్రి వాకిటి శ్రీహరి,ఎమ్మెల్యేలు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, కవ్వంపల్లి సత్యనారాయణ, శివసేన రెడ్డి , సంపత్ కుమార్, అనిల్, వినయ్ కుమార్ ఉన్నారు.
అడ్లూరి సోదరుడి లాంటి వారు: పొన్నం
మంత్రి అడ్లూరి లక్ష్మణ్కువ్యక్తిగతంగా క్షమాపణలు చెబుతున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ‘‘నేను ఆ మాట అనకపోయినా క్షమాపణలు చెబుతున్నా. పత్రికా కథనాలతో మంత్రి అడ్లూరి మనస్తాపం చెందారు. అందుకే ఆయనకు క్షమాపణలు చెబుతున్నా. మంత్రి అడ్లూరికి, నాకు పార్టీ సంక్షేమం తప్ప మరో ఉద్దేశం లేదు. కాంగ్రెస్ నేతలమంతా సామాజిక న్యాయం కోసం పని చేస్తాం’’ అని తెలిపారు. సామాజిక న్యాయంలో భాగంగా బలహీనవర్గాల కోసం రాహుల్ గాంధీ సూచన మేరకు సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంలో 42 శాతం రిజర్వేషన్లకు పోరాటం జరుగుతుందని పొన్నం ప్రభాకర్ అన్నారు. మేమంతా ఐక్యంగా భవిష్యత్‌లో సామాజిక న్యాయం కోసం పని చేస్తామని చెప్పారు. లక్ష్మణ్‌కు వ్యక్తిగతంగా క్షమాపణలు చెప్తున్నా.. కరీంనగర్లో మాదిగ సామాజిక వర్గం, మేమంతా కలిసి పెరిగామని గుర్తు చేసుకున్నారు. ఆ అపోహ ఉండొద్దని విజ్ఞప్తి చేస్తున్నానని తెలిపారు. సామాజిక న్యాయానికి ఛాంపియన్.. కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగిన వ్యక్తిగా తనకు, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌కు పార్టీ సంక్షేమం తప్ప ఎటువంటి దురుద్దేశం లేదని స్పష్టం చేశారు.
సమస్య ముగిసింది: అడ్లూరి
మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడుతూ..‘అట్టడుగు సామాజిక వర్గాలకు కాంగ్రెస్ అండగా ఉంటుంది. జెండా మోసిన నాకు మంత్రిగా అవకాశం ఇచ్చారు. పార్టీ లైన్ దాటే వ్యక్తిని నేను కాదు. పొన్నం ప్రభాకర్‌ను గౌరవిస్తా.. కానీ, పొన్నం వ్యాఖ్యల పట్ల నా మాదిగ జాతి బాధపడింది. పొన్నం క్షమాపణ కోరడంతో ఈ సమస్య ఇంతటితో సమసిపోయింది అని చెప్పుకొచ్చారు.
టీపీసీసీ కీలక వ్యాఖ్యలు..
టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ..‘పొన్నం ప్రభాకర్ చేశారన్న వ్యాఖ్యల పట్ల లక్ష్మణ్ నోచ్చుకోవడం, యావత్ సమాజం కొంత బాధపడింది. మంత్రుల మధ్య జరిగిన ఘటన కుటుంబ సమస్య. జరిగిన ఘటన పట్ల చింతిస్తూ మంత్రి ప్రభాకర్ క్షమాపణలు చెప్పారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కష్టపడి పైకొచ్చిన నేతలు. ఈ సమస్య ఇంతటితో సమసిపోవాలని యావత్ మాదిగ సామాజిక వర్గానికి విజ్ఞప్తి చేస్తున్నాను. సహచర మంత్రి వర్గానికి విజ్ఞప్తి చేస్తున్నా.. ఎక్కడ మాట్లాడిన బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల పార్టీ’ అని తెలిపారు.
పొన్నం ఇంటివద్ల హై టెన్షన్
మంత్రి అడ్లూరి పై మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలకు నిరసనగా దళిత సంఘాలు పొన్నం ఇంటి ముట్టడికి పిలుపునిచ్చాయి. దీంతో ప్రభాకర్ ఇంటి వద్ద భద్రత పెంచారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పై పొన్నం ప్రభాకర్ అనుచిత వ్యాఖ్యల పై దళిత సంఘాల ఆగ్రహం వ్యక్తం చేశాయి. అడ్లూరి కి క్షమాపణ చెప్పకపోతే.. పొన్నం ఇంటిని ముట్టడిస్టామని దళిత సంఘాలు హెచ్చరించాయి. పొన్నం ఇంటి ముట్టడి పిలుపు నేపథ్యంలో పోలీసులు భద్రతను పెంచారు.పొన్నం ఇంటి ముందు బారికేడ్స్ ఏర్పాటు చేశారు. మంత్రి అడ్లూరి లక్ష్మన్‌కుమార్‌ను ఉద్దేశించి మరో మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు దుమారం లేపాయి. ఆయనను దున్నపోతు అని సంభాషించడం వివాదానికి దారి తీసింది. తను మాదిగ అయినందునే తనను తక్కువ చేస్తున్నారని అడ్లూరి అసహానం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఈ వివాదం ముగియడంతో హస్తం పార్టీ ఊపిరి పీల్చుకుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com