TG: పాడె మోసిన సీపీ సజ్జనార్

మాజీ డీజీపీ హెచ్ జే దొర అంత్యక్రియలు అశ్రు నయనాల మధ్య ముగిశాయి. అధికార లాంఛనాలతో మాజీ డీజీపీకి అంతిమ వీడ్కోలు పలికారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు డీజీపీగా సేవలందించిన దొర అంత్యక్రియలు హైదరాబాదులో అశ్రునయనాల మధ్య నిర్వహించగా, పలువురు పోలీసు ఉన్నతాధికారులు, కుటుంబ సభ్యులు, అభిమానులు పాల్గొని తమ నివాళులు అర్పించారు. ఆయన సేవలను స్మరించుకుంటూ పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. దొర స్వగృహం నుంచి ప్రారంభమైన అంతిమయాత్రలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. వీసీ సజ్జనార్, అవినాశ్ మహంతీ సహా అనేక మంది ఉన్నతాధికారులు హాజరై దొర కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా సీపీ సజ్జనార్ స్వయంగా దొర పాడె మోసి ఆయనకు చివరి నివాళి అర్పించడం అక్కడున్న వారిని కదిలించింది. అనంతరం మహా ప్రస్థానంలో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించి దొరకు తుది వీడ్కోలు పలికారు.
దొర స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని కోట బొమ్మాళి మండలంలోని జర్జంగి గ్రామం. 1943లో సత్యనారాయణ దొర, సుశీలమ్మ దంపతులకు ఆయన జన్మించారు. చిన్ననాటి విద్యను స్వగ్రామంలోనే పూర్తిచేసిన ఆయన, హైస్కూలు చదువును కోటబొమ్మాళిలో కొనసాగించారు. అనంతరం విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీలో ఆర్థికశాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ సాధించారు. 1965లో ఇండియన్ పోలీస్ సర్వీస్‌లో చేరిన దొర, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పలు జిల్లాల్లో ఎస్పీగా సేవలందించారు. తర్వాత ఆయన 1989 నుంచి 1992 వరకు APSRTCలో వైస్ ఛైర్మన్, ఎండీగా పనిచేశారు. 1996లో డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన ఆయన 2002 వరకు ఆ పదవిలో కొనసాగి విశేష సేవలు అందించారు. కేంద్ర స్థాయిలో కూడా కీలక బాధ్యతలు నిర్వర్తించిన దొర, సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్‌గా, అలాగే సీఐఎస్ఎఫ్ డీజీగా పనిచేశారు. అదనంగా ఇండియన్ ఒలింపిక్ వెయిట్‌లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కూడా సేవలందించారు.
పోలీసు విధుల్లో క్రమశిక్షణ, నిబద్ధతకు ప్రతీకగా నిలిచిన దొర రచనల ద్వారా కూడా తన అనుభవాలను పంచుకున్నారు. ‘ఇంపాక్ట్ ఆఫ్ ట్రైనింగ్ ఆన్ ది పెర్‌ఫార్మెన్స్ ఆఫ్ ఐపీఎస్’, ‘ఎన్టీఆర్‌తో నేను’ వంటి పుస్తకాలతో పాటు ‘జర్నీ థ్రూ టర్బులెంట్ టైమ్స్’ పేరుతో తన ఆత్మకథను రచించారు. విధుల్లో కఠినంగా వ్యవహరించినప్పటికీ వ్యక్తిగతంగా ఆధ్యాత్మికతకు ప్రాధాన్యం ఇచ్చే వ్యక్తిగా ఆయన పేరు గడించారు. సత్య సాయిబాబాపట్ల ఆయనకు ప్రత్యేక భక్తి ఉండేది. ఆయన మరణంతో పోలీసు విభాగం ఒక అనుభవజ్ఞుడైన అధికారిని కోల్పోయిందని పలువురు అభిప్రాయపడ్డారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
