TG: కాళేశ్వరం నివేదికపై అసెంబ్లీలో చర్చ

త్వరలోనే అసెంబ్లీలో కాళేశ్వరం కమిషన్ నివేదికను ప్రవేశపెడతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. అసెంబ్లీలో చర్చించాకే తదుపరి ఏం చేయాలనే దానిపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ నివేదికపై అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకుంటామన్నారు. ఇది రాజకీయ పార్టీనో.. ప్రజా సంఘాలో ఇచ్చిన నివేదిక కాదన్న రేవంత్... అవినీతి కాళేశ్వరం కుప్పకూలిందన్నారు. ప్రజా ప్రతినిధులకు నివేదిక ఇస్తామని వెల్లడించారు.
మంత్రి మండలి ఆమోదం
కాళేశ్వరం కమిషన్ నివేదికను తెలంగాణ మంత్రి మండలి ఆమోందించింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. కాళేశ్వరం కమిషన్ నివేదికను కేబినెట్ ఆమోదించిందని.. త్వరలోనే దీనిపై అసెంబ్లీలో చర్చిస్తామని తెలిపారు. ప్రజాప్రతినిధులు అందరికీ కమిషన్ నివేదిక ఇస్తామని చెప్పారు. అసెంబ్లీలో అందరూ స్వేచ్ఛగా అభిప్రాయాలు చెప్పొచ్చు అని అన్నారు. ఇది ఓ రాజకీయ పార్టీ లేదా ప్రభుత్వం ఇచ్చిన నివేదిక కాదని.. నిపుణుల కమిటీ ఇచ్చిందని తెలిపారు. దీనిపై ఎవరు ఏ రకంగా మాట్లాడుతారు అనేది వారి విజ్ఞతకే వదిలేస్తున్నా అని అన్నారు.
రాష్ట్రాన్ని పణంగా పెట్టారు: ఉత్తమ్
కాళేశ్వరం ప్రాజెక్టు కోసం గత పాలకులు అధిక వడ్డీలతో రూ.84వేల కోట్ల అప్పు తెచ్చారని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. క్యాబినెట్ భేటీ అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి, ఇతర మంత్రులతో కలిసి మీడియాతో ఆయన మాట్లాడారు. రూ.38వేల కోట్లతో తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు చేపట్టాల్సి ఉండగా.. మేడిగడ్డకు మార్చారని చెప్పారు. భారీగా తెచ్చిన అప్పులతో చేపట్టిన కాళేశ్వరం..బీఆర్ఎస్ హయాంలోనే కూలిపోయిందన్నారు.
అంతా కేసీఆరే చేశారు: డిప్యూటీ సీఎం
మూడు బ్యారేజీల దుస్థితికి కేసీఆర్ కారణమని పీసీ ఘోష్ కమిషన్ నివేదిక చెబుతోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. కేసీఆర్ సొంత నిర్ణయాలే తప్ప.. నిపుణుల కమిటీ నివేదిక అమలు చేయలేదని మండిపడ్డారు. సరైన అధ్యయనాలు, పరిశోధనలు లేకుండానే డిజైన్లు రూపొందించారన్నారు. నిపుణుల కమిటీ సూచనల మేరకే ప్రాజెక్టు కడుతున్నామని కేసీఆర్ అసెంబ్లీలో చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com