TG: సర్పంచ్‌లకు కీలక బాధ్యతలు

TG: సర్పంచ్‌లకు కీలక బాధ్యతలు
X
అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేసేందుకు ఏర్పాటు చేసిన కమిటీకి ఛైర్మన్‌గా సర్పంచ్‌లు

తెలంగాణలో పిల్లల పోషణ, తల్లుల ఆరోగ్య సంరక్షణను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అంగన్‌వాడీ కేంద్రాల పనితీరుపై నేరుగా పర్యవేక్షణ ఉండేలా కొత్త వ్యవస్థను అమల్లోకి తీసుకొచ్చిన ప్రభుత్వం.. సర్పంచ్‌లకు అదనపు బాధ్యతలు అప్పగించింది. అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణలో కీలక పాత్ర కల్పించింది. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం, ప్రతి గ్రామంలో అంగన్‌వాడీ కేంద్రాలను పర్యవేక్షించే ప్రత్యేక కమిటీలకు సర్పంచ్‌లు ఛైర్మన్‌లుగా వ్యవహరించనుండగా, కేంద్రాల పనితీరును నిత్యం గమనించే బాధ్యత వారిపై ఉంటుంది. అంగన్‌వాడీ కేంద్రాలకు ప్రభుత్వం నుంచి సరఫరా అయ్యే బియ్యం, పప్పులు, బాలామృతం, గుడ్లు, పాలు వంటి పోషకాహార పదార్థాల నాణ్యతను ఈ కమిటీలు నిరంతరం తనిఖీ చేయనున్నాయి. సరుకులు సకాలంలో, లబ్ధిదారులకు పూర్తిస్థాయిలో చేరుతున్నాయా లేదా అన్నదానిపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు.

రెండేళ్లుగా గ్రామాల్లో ఎన్నికైన పాలకవర్గాలు లేకపోవడంతో, అనేక చోట్ల అంగన్‌వాడీ కేంద్రాల పర్యవేక్షణ పూర్తిగా సడలిపోయినట్టు ప్రభుత్వం గుర్తించింది. ఈ సమయంలో పౌష్టికాహారం పక్కదారి పడటం, సరుకుల నాణ్యతలో లోపాలు రావడం వంటి ఫిర్యాదులు పెద్ద సంఖ్యలో వెలుగుచూశాయి. ముఖ్యంగా చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు చేరాల్సిన ఆహారం సక్రమంగా అందడం లేదన్న ఆరోపణలు రావడంతో ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. సర్పంచ్‌ల నేతృత్వంలో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయనుంది.

ఈ కమిటీకి సర్పంచ్ ఛైర్మన్‌గా వ్యవహరించనుండగా, మొత్తం 11 మంది సభ్యులు ఉంటారు. అంగన్‌వాడీ టీచర్ కన్వీనర్‌గా, ఏఎన్‌ఎం, స్కూల్ సైన్స్ టీచర్, ఒక రిటైర్డ్ ఉద్యోగి, చిన్నారుల తల్లులు ఇందులో సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ ప్రతి నెలా కేంద్రాలకు అందుతున్న బియ్యం, పప్పు, బాలామృతం, గుడ్లు, పాలు వంటి సరుకుల నాణ్యతను, పంపిణీని తనిఖీ చేస్తుంది. ఆరోగ్యలక్ష్మి పథకం ద్వారా గర్భిణులు, బాలింతలకు అందుతున్న భోజనాన్ని కూడా పరిశీలిస్తుంది. లక్షల రూపాయల విలువైన పోషకాహారం లబ్ధిదారులకు సక్రమంగా అందేలా చూడటమే ఈ కమిటీ ప్రధాన విధి.

Tags

Next Story