TG: జనవరి చివరి వారంలో మున్సిపల్ ఎన్నికలు

TG: జనవరి చివరి వారంలో మున్సిపల్ ఎన్నికలు
X
జనవరి 1న వార్డుల వారీగా ఓటర్ల జాబితా ప్రకటన... జనవరి 5న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఆల్ పార్టీ మీటింగ్స్​

తెలంగాణలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల కమిషన్ సన్నాహాలు వేగవంతం చేశాయి. ఫిబ్రవరి రెండో వారంలోగా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలనే లక్ష్యంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని కీలక ఉత్తర్వులు జారీ చేశారు. జీహెచ్‌ఎంసీ, మరో 4 మున్సిపాలిటీలు మినహా రాష్ట్రవ్యాప్తంగా మిగిలిన 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లలో వార్డుల వారీగా ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లను ఆమె ఆదేశించారు. ఎన్నికల కమిషన్ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం, అసెంబ్లీ నియోజకవర్గాల ఓటర్ల జాబితాను ప్రామాణికంగా తీసుకుని ఫోటో ఆధారిత ఓటర్ల జాబితాను రూపొందించనున్నారు. ఈ ప్రక్రియలో భాగంగా డిసెంబరు 30న పోలింగ్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ చేపట్టి, జనవరి 1న ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేస్తారు. అనంతరం జనవరి 5న రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమై, వారి నుంచి అభ్యంతరాలను స్వీకరించిన తర్వాత జనవరి 10న ఓటర్ల తుది జాబితాను ప్రచురించాలని రాణి కుముదిని పేర్కొన్నారు.

జనవరి 1న వార్డుల వారీగా ఓటర్ల జాబితా ప్రకటించి అభ్యంతరాలు స్వీకరించనున్నది. జనవరి 5న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో, 6న కలెక్టరేట్లలో ఆల్ పార్టీ మీటింగ్స్ నిర్వహిస్తారు. అనంతరం జనవరి 10న మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల వారీగా వార్డులు, పోలింగ్ స్టేషన్ల ప్రకారం ఫైనల్ ఓటర్​లిస్టులు ప్రకటిస్తారు. ఈ మేరకు సోమవారం రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుమిదిని నోటిఫికేషన్ జారీ చేశారు.

ఉత్తమ్ కీలక వ్యాఖ్యలు

మున్సిపాలిటీ & మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జనవరి చివరి వారంలో కానీ, ఫిబ్రవరి మొదటి వారంలో కానీ నిర్వహించే అవకాశం ఉంది. ఈ తరుణంలో హుజూర్ నగర్, నేరేడుచర్ల మున్సిపాలిటీల పరిధిలోని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మున్సిపల్ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని హుజూర్ నగర్ ఎమ్మెల్యే , రాష్ట్ర నీటిపారుదల పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులకు మంగళవారం ఒక ప్రకటన ద్వారా పిలుపునిచ్చారు. ఈ శాసనసభ సమావేశాలు ముగియగానే హుజూర్ నగర్ నేరేడుచర్ల మున్సిపాలిటీ లో కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించి మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక ,ప్రచార కార్యక్రమాల పై చర్చిద్దాం అన్నారు.

Tags

Next Story