TG: పార్టీలకు ప్రతిష్టాత్మకంగా పురపాలక పోరు

తెలంగాణ రాజకీయాలు మరో కీలక మలుపు వద్ద నిలిచాయి. గ్రామ పంచాయితీ ఎన్నికల వేడి ఇంకా చల్లారకముందే, ఇప్పుడు పట్టణ రాజకీయాలకు తెరలేచింది. రాష్ట్రంలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో అధికార–ప్రతిపక్షాల మధ్య కొత్త రాజకీయ సమరం మొదలైంది. పట్టణ ఓటరు తీర్పే రేవంత్ సర్కార్ బలాన్ని నిర్ధారించనుందన్న అంచనాలతో, ఈ ఎన్నికలు రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత కీలకంగా మారాయి.
కాంగ్రెస్‌కు ప్రతిష్టాత్మకం
తెలంగాణలో మరోసారి ఎన్నికల వాతావరణం ఏర్పడింది. ఇటీవల ముగిసిన గ్రామ పంచాయితీ ఎన్నికల అనంతరం, ఇప్పుడు పట్టణ ప్రాంతాల్లో ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. ఈ ఎన్నికల ద్వారా రాష్ట్రంలోని ఏడు కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీల్లో పాలకవర్గాల ఏర్పాటుకు ప్రజలు తమ తీర్పు ఇవ్వనున్నారు. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో మళ్లీ హీట్ పెరిగింది.ఈ ఎన్నికలు ముఖ్యంగా అధికార కాంగ్రెస్ కు ప్రతిష్ఠాత్మకంగా మారాయి. గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్‌కు సంప్రదాయంగా బలం ఉండగా, పట్టణ ప్రాంతాల్లో ఆ పార్టీ ప్రభావం తక్కువగానే ఉందన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా ఈ విషయాన్ని కొంతవరకు స్పష్టం చేశాయని విశ్లేషకులు చెబుతున్నారు. అందుకే పంచాయితీ ఎన్నికల్లో గెలుపు ఊపు కొనసాగించగలమా? లేక పట్టణ ఓటరు కాంగ్రెస్‌కు షాక్ ఇస్తారా? అన్నది ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది. ప్రతిపక్షాలు ఇప్పటికే కాంగ్రెస్‌పై ప్రజా వ్యతిరేకత పెరిగిందని ఆరోపిస్తున్నాయి. అలాంటి సమయంలో మున్సిపల్ ఎన్నికలకు వెళ్లడం రేవంత్ ప్రభుత్వం తీసుకున్న సాహసోపేత నిర్ణయంగా రాజకీయ వర్గాలు చూస్తున్నాయి. ఒకవేళ ఈ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌కు అనుకూల ఫలితాలు వస్తే, ప్రతిపక్షాల ఆరోపణలకు గట్టి సమాధానం చెప్పినట్లే అవుతుంది. కానీ ఫలితాలు ప్రతికూలంగా వస్తే, ప్రభుత్వంపై ప్రజా అసంతృప్తి ఉందన్న వాదనలకు బలం చేకూరే అవకాశముంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ స్వయంగా జిల్లాల పర్యటనలు ప్రారంభించారు. పార్టీ శ్రేణులను కదిలించడంతో పాటు, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. టీపీసీసీ చీఫ్ ముఖేశ్ కుమార్, ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పార్టీని ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు. ఈ చర్యలే ఈ ఎన్నికలు కాంగ్రెస్‌కు ఎంత కీలకమో చెబుతున్నాయని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.
కాంగ్రెస్ లక్ష్యం ఈ ఎన్నికల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఎక్కువ సంఖ్యలో కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను కైవసం చేసుకోవడం ద్వారా పట్టణ రాజకీయాల్లోనూ తమ పట్టు పెంచుకోవాలని పార్టీ వ్యూహం రచిస్తోంది. దాదాపు 90 శాతం స్థానాల్లో విజయం సాధించాలనే లక్ష్యంతో కాంగ్రెస్ ముందుకెళ్తున్నట్లు పార్టీ వర్గాల సమాచారం.
ప్రతిపక్షాలకు ప్రతిష్టాత్మకమే
మరోవైపు ప్రతిపక్షాలైన భారత రాష్ట్ర సమితి, బీజేపీ కూడా ఈ ఎన్నికలను సీరియస్‌గా తీసుకుంటున్నాయి. బిఆర్ఎస్ ఇప్పటికే గ్రామ పంచాయితీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గట్టి పోటీ ఇచ్చింది. మున్సిపల్ ఎన్నికల్లోనూ అదే స్థాయిలో పోరాడాలని భావిస్తోంది. ఇక పట్టణ ప్రజల పార్టీగా గుర్తింపు పొందిన బీజేపీకి ఈ ఎన్నికలు కీలక అవకాశంగా మారాయి. గత ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయినా, పట్టణ ప్రాంతాల్లో తన బలాన్ని నిరూపించుకునే అవకాశం ఉందని కమలనాథులు భావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మున్సిపల్ ఎన్నికలు త్రిముఖ పోరుగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్ష బిఆర్ఎస్, జాతీయ పార్టీ బీజేపీ—మూడు పార్టీలూ వీలైనన్ని ఎక్కువ స్థానాలు సాధించేందుకు వ్యూహాత్మకంగా ముందుకు సాగనున్నాయి. దీంతో ఈ ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
త్రిముఖ పోరు
మొత్తంగా చూస్తే, తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు కేవలం స్థానిక సంస్థలకే పరిమితం కావడం లేదు. ఇవి రేవంత్ సర్కార్‌కు ప్రజల మూడ్‌ను కొలిచే లిట్మస్ టెస్ట్లా మారాయి. పట్టణ ఓటరు తీర్పు ఏ పార్టీకి అనుకూలంగా ఉంటుందో, ఏ పార్టీకి హెచ్చరికగా మారుతుందో చూడాల్సిందే. ఫలితాలు ఏవైనా, రాష్ట్ర రాజకీయాల దిశను మాత్రం ఇవి ప్రభావితం చేయడం ఖాయం. గత అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఇటీవల జరిగిన గ్రామ పంచాయితీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బిఆర్ఎస్ మధ్యనే ప్రధానంగా పోటీ జరిగింది. బిజెపి పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. కానీ పట్టణ ప్రజల పార్టీగా గుర్తింపుపొందిన బిజెపి మున్సిపాలిటీల్లో ప్రభావం చూపించే అవకాశాలున్నాయి. దీంతో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బిఆర్ఎస్, బిజెపిల మధ్య త్రిముఖ పోరు ఉండే అవకాశాలున్నాయి. మూడు పార్టీలు వీలైనన్ని ఎక్కువ కార్పోరేషన్లు, మున్సిపాలిటీలను సాధించేందుకు విశ్వప్రయత్నం చేస్తాయి. కాబట్టి ఈ ఎన్నికలు రసవత్తరంగా ఉండనున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
