TG: ప్రతిష్టాత్మకంగా గ్లోబల్ సమ్మిట్

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు ఏర్పాట్లు చకచకా సాగిపోతున్నాయి. 2047నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రూపొందించడమే లక్ష్యంగా సమ్మిట్ నిర్వహించనున్నారు. మొత్తం 1,686 మంది ప్రతినిధులు, 42 దేశాల నుంచి 255 మంది అంతర్జాతీయ డెలిగేట్లు హాజరు కానున్నారు. అంతర్జాతీయ సంస్థల పెట్టుబడులకు హైదరాబాద్‌ను కేంద్రంగా నిలపాలన్న ఉద్దేశంతో డిసెంబర్ 8, 9 తేదీల్లో తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్‌ను నిర్వహిస్తోంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అంతర్జాతీయ పెట్టుబడిదారులు, ప్రముఖ పరిశ్రమల ప్రతినిధులు పాల్గొంటున్న ఈ సమ్మిట్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఫ్యూచర్ సిటీని ప్రపంచ స్థాయి పెట్టుబడుల కేంద్రంగా మారుస్తామంటోంది.
హైదరాబాద్‌లోని భారత్ ఫ్యూచర్ సిటీలో ఈ నెల 8, 9 తేదీల్లో నిర్వహించే ‘తెలంగాణ రైజింగ్-2047 గ్లోబల్ సమిట్’కు రావాల్సిందిగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, జమ్మూకశ్మీర్, ఝార్ఖండ్, అస్సాం ముఖ్యమంత్రులు చంద్రబాబు, స్టాలిన్, ఒమర్ అబ్దుల్లా, హేమంత్ సోరెన్, బిశ్వశర్మలను రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు ఆహ్వానించారు. శుక్రవారం ఉదయం రాంచీ వెళ్లిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. సీఎం హేమంత్ సోరెన్ నివాసానికి వెళ్లి గ్లోబల్ సమిట్‌కు రావాలని ప్రత్యేకంగా ఆహ్వానించారు. 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వృద్ధే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతోందని భట్టి తెలిపారు. దీనికి అనుగుణంగా అన్ని రంగాల వృద్ధి లక్ష్యాలు, అనుసరించే భవిష్యత్తు ప్రణాళికలను విశ్లేషించేలా తెలంగాణ రైజింగ్-2047 విజన్ డాక్యుమెంట్‌ను రూపొందించినట్లు సీఎంకు వివరించారు. మంత్రి ఉత్తమ్ శుక్రవారం చెన్నై వెళ్లి తమిళనాడు సీఎం స్టాలిన్‌ను కలిసి సమిట్‌కు రావాలని ఆహ్వాన పత్రికను అందజేశారు.
తెలంగాణను ప్రపంచ స్థాయి ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. 42 దేశాలకు చెందిన 1361 సంస్థలు సమ్మిట్‌లో పాల్గొననున్నాయి. ఈ సమ్మిట్‌తో రాబోయే రెండు దశాబ్దాల పాటు అభివృద్ధికి బలమైన పునాది పడనుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

