TG: మిగిలిన ఎమ్మెల్యేలకు ఊరట..?

ఐదుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ దాఖలు చేసిన అనర్హత పిటిషన్లపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కీలక తీర్పు వెలువరించారు. ఐదుగురు ఎమ్మెల్యేలు అరికపూడి గాంధీ, తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి లపై అనర్హత పిటీషన్లను కొట్టివేస్తూ స్పీకర్ తీర్పును వెలువరించారు. ఐదుగురు ఎమ్మెల్యేలు కూడా పార్టీ ఫిరాయించినట్లుగా ఎక్కడా ఆధారాలు లేవంటూ స్పీకర్ వారిపై అనర్హత వేటు వేయడానికి నిరాకరించారు. అయిదుగురు ఎమ్మెల్యేలపై బీఆర్ ఎస్ చేసిన ఫిరాయింపు అభియోగాలను త్రోసిపుచ్చారు. వారు పార్టీ ఫిరాయించినట్లుగా బీఆర్ఎస్ చేసిన వాదనతో స్పీకర్ ఏకీభవించలేదు. ఈ నెల 18వ తేదీ లోపు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఏదో ఒక నిర్ణయాన్ని వెలువరించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ తన తీర్పును వెలువరించడం విశేషం.
వారికి కూడా త్వరలోనే ఊరట
స్పీకర్ తాజా నిర్ణయంతో ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలకు భారీ ఊరట దక్కింది. అనర్హత వేటుకు నిరాకరణతో ఊరట పొందిన ఐదుగురు ఎమ్మెల్యేల తరహాలోనే మిగతా ముగ్గురు ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, డాక్టర్ సంజయ్, పోచారం శ్రీనివాస్‌రెడ్డిలకు త్వరలో అనర్హత వేటు తప్పవచ్చని భావిస్తున్నారు. ఇకపోతే కడియం శ్రీహరి, దానం నాగేందర్ లు మాత్రం స్పీకర్ నోటీసులకు సమాధానం ఇవ్వడంలో మరింత సమయం అడిగిన నేపథ్యంలో వారిపై నిర్ణయం ఆసక్తికరంగా మారింది.
కడియం శ్రీహరి స్పష్టత
తాను ఇప్పటికీ భారాస సభ్యుడిగా కొనసాగుతున్నానని, కాంగ్రెస్ పార్టీలో చేరలేదని ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు. భారాస తరఫున గెలిచి.. కాంగ్రెస్ పార్టీలో చేరారని కడియంపై భారాస ఎమ్మెల్యే కేపీ వివేకానంద గతంలో స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై వివరణ ఇవ్వాలని సభాపతి గడ్డం ప్రసాద్‌కుమార్ కార్యాలయం నుంచి లేఖ వెళ్లగా.. కడియం తన వివరణను లిఖితపూర్వకంగా సభాపతికి అందజేశారు. ‘‘నాపై అనర్హత వేటు వేయాలంటూ భారాస చేసిన ఫిర్యాదు నిరాధారమైనది. నేను ఇప్పటికీ ఆ పార్టీ సభ్యుడిగానే కొనసాగుతున్నా. ప్రతి నెలా నా వేతనం నుంచి రూ.5వేల చొప్పున భారాస శాసనసభా పక్షం.. ఖర్చుల కోసం స్వీకరిస్తోంది. ఫిరాయింపు నిరోధక చట్టం నిబంధనలను నేను ఉల్లంఘించలేదు’’ అని కడియం పేర్కొన్నారు. దీనిపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

