TG: తెలంగాణ మంత్రివర్గ విస్తరణ తథ్యం..!

తెలంగాణ మంత్రివర్గంలో భారీ ప్రక్షాళన జరగనుందా!? పనితీరు బాగా లేని కొంతమంది మంత్రులను తప్పించి.. అదే వర్గానికి చెందిన మరికొందరికి అవకాశం కల్పించనున్నారా!? అంటే ఔననే సమాధానమే వస్తోంది. డిసెంబరులో లేదా వచ్చే ఏడాది జనవరిలో భారీ ప్రక్షాళన చేపట్టనుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి డిసెంబరుకు రెండేళ్లు పూర్తి కానున్న నేపథ్యంలో మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించనున్నట్లు తెలుస్తోంది. దీనితోపాటు మంత్రుల శాఖల్లోనూ భారీగా మార్పులు తీసుకు రానున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ కసరత్తులో కొత్తగా నియమితులైన నలుగురు మంత్రులకు మినహాయింపు ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి. మంత్రివర్గంలో మరో ఇద్దరికి అవకాశం ఉంది. పునర్ వ్యవస్థీకరణతో మరి కొందరికి అవకాశం దక్కనుందని చెబుతున్నారు. వాస్తవానికి, క్యాబినెట్లో ముఖ్యమంత్రి సహా 18 మందికి అవకాశం ఉంటుంది. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అనుకున్న విధంగా ఫలితాలు రాకపోతే మాత్రం సీఎం రేవంత్ రెడ్డి కొద్ది మంది మంత్రులకు క్యాబినెట్ నుంచి ఉద్వాసన పలికే అవకాశాలున్నాయన్న చర్చ సాగుతోంది.అనుకున్న రీతిలో ప్రజల్లో ప్రభుత్వానికి మంచి పేరు రాలేదన్న అసంతృప్తిలో కాంగ్రెస్ హైకమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఆరు గ్యారంటీలలో మహిళలకు ఉచిత ఫ్రీ బస్, రైతులకు పెంచిన ఆర్థిక సాయం, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ వంటివి అందిస్తున్నా ప్రజల్లో అనుకున్నంత పాజిటీవ్ వేవ్ పార్టీకి లేదని కాంగ్రెస్ అధినాయకత్వం భావిస్తున్నట్లు పార్టీ వర్గాలే చెబుతున్నాయి.
మరోవైపు ఆరు గ్యారంటీల్లో ఇతర పథకాలు ఇంకా పట్టాలు ఎక్కలేదు. వీటిపై ప్రజల్లో కొంత అసంతృప్తి ఉంది. వీటిని ప్రతిపక్షాలు ప్రతీ వేదికపై చెబుతూ ప్రజల్లోకి వెళుతున్నాయి. ఈ పరిస్థితుల్లో కొందరు మంత్రుల పనితీరుపైన పార్టీ హైకమాండ్ అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. కొందరు మంత్రులు పార్టీ లైన్ దాటి మితిమీరిన స్వాతంత్రంతో చేస్తున్న వ్యాఖ్యలు పార్టీకి తీవ్ర నష్టం చేస్తున్నాయన్న భావనలోనూ హైకమాండ్ ఉంది. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కొండా సురేఖను తప్పించి, ఆమె స్థానంలో విజయశాంతికి అవకాశం కల్పిస్తారన్న ప్రచారం సాగుతోంది. మంత్రి పొన్నం ప్రభాకర్‌ను పీసీసీ చీఫ్‌గా నియమించి, ప్రస్తుత చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌ను మంత్రివర్గంలోకి తీసుకుంటారన్న వార్తలు గుప్పుమంటున్నాయి. సీఎంతో నేరుగా తలపడిన మంత్రి జూపల్లి కృష్ణారావుకు ఉద్వాసన తప్పదన్న చర్చ కాంగ్రెస్ పార్టీలో సాగుతోంది. ఆయన స్థానంలో మరో బలమైన సామాజిక వర్గం నుంచి అవకాశం ఇస్తారని చెబుతున్నారు. మల్ రెడ్డి రంగారెడ్డికి అవకాశం ఉందన్న ప్రచారం ఉంది. ఇక కోమటి రెడ్డి వెంకటరెడ్డిని తొలగించి ఆయన స్థానంలో కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డికి అవకాశం ఇవ్వవచ్చన్న చర్చ నడుస్తోంది. గత కొంత కాలంగా రాజగోపాల్ రెడ్డి పార్టీపై అసంతృప్తి వెళ్లగక్కుతున్న విషయం తెలిసిందే.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

