TG: దివ్యాంగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త.

TG:  దివ్యాంగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త.
X
ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం

తెలంగాణ ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమానికి మరొక కీలక అడుగు వేసింది. రాష్ట్రంలోని దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో 100 శాతం ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే ఆరు గ్యారెంటీల్లో భాగంగా అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులో ఉండగా, తాజాగా ఈ ప్రయోజనాన్ని దివ్యాంగ పురుషులకు కూడా విస్తరించింది. ప్రస్తుతం రాష్ట్రానికి చెందిన బాలికలు, మహిళలు, ట్రాన్స్‌జెండర్లకు ఉచిత బస్సు ప్రయాణం అమల్లో ఉంది. వీరు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) నిర్వహిస్తున్న పల్లె వెలుగు మరియు ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో రాష్ట్ర సరిహద్దులలో ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించవచ్చు. అంతర్రాష్ట్ర పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో కూడా తెలంగాణ సరిహద్దు వరకు ఈ సదుపాయం వర్తిస్తోంది.

ఇప్పటివరకు మహిళలకు మాత్రమే పరిమితమైన ఈ పథకాన్ని విస్తరించి, రాష్ట్రంలోని దివ్యాంగ పురుషులకు కూడా పూర్తిస్థాయి ఉచిత ప్రయాణాన్ని కల్పించడం ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయంగా భావిస్తున్నారు. ఈ నిర్ణయం వల్ల దివ్యాంగులు విద్య, ఉపాధి, వైద్యం తదితర అవసరాల కోసం సులభంగా ప్రయాణించగలరు.దివ్యాంగుల సామాజిక, ఆర్థిక అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని తీసుకున్న ఈ నిర్ణయం వారికి మరింత స్వావలంబన, చలన స్వేచ్ఛ కల్పించనుంది. రాష్ట్ర ప్రభుత్వ తాజా ఉత్తర్వులతో దివ్యాంగులకు ప్రయాణ భారాన్ని తగ్గిస్తూ మరింత సౌలభ్యం కలిగించనుంది.

Tags

Next Story