TG: కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ

TG: కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ
X
తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చామన్న సీఎం రేవంత్

తెలంగాణలోని 27 జిల్లా కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహాలు ఆవిష్కరించామని సీఎం రేవంత్​ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ జరగడం ఆనందంగా ఉందన్నారు. అన్ని జిల్లా కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహాలను ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి వర్చువల్​గా ఆవిష్కరించారు. హైదరాబాద్​లోని ఫ్యూచర్​ సిటీ వేదికగా ఆయన ప్రారంభించారు. ఇంకా ఆరు జిల్లా కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహాల నిర్మాణం పూర్తి కాలేదు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు తెలంగాణ తల్లి విగ్రహాన్ని సంప్రదాయ పల్లెటూరి మహిళా రైతు రూపంలో తీర్చిదిద్దారు. పసుపుపచ్చ అంచుతో కూడిన ఆకుపచ్చ చీర, నుదుటన ఎర్రని బొట్టు, కాళ్లకు కడియాలు, ముక్కుపుడక, మట్టి గాజులు, గుండు పూసల హారంతో అలంకరించారు. ఎడమ చేతిలో మొక్కజొన్న, గోధుమ, సజ్జ కంకులు పట్టుకుని చిరునవ్వుతో కనిపించేలా విగ్రహాన్ని రూపొందించారు. తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో గతంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్టించిన విధంగా.. రాష్ట్రంలోని అన్ని కలెక్టరేట్లలో ఇదే నమూనాను అనుసరించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో తెలంగాణ రాష్ట్రంలో 33 కలెక్టరేట్లలో ఒక్కో విగ్రహానికి రూ.17.50లక్షల చొప్పున మొత్తం రూ.5.8కోట్లతో తెలంగాణ తల్లి విగ్రహాలను ప్రభుత్వం ఏర్పాటు చేయించింది.

తెలంగాణ తల్లిని తలచుకుని పనులు మొదలుపెట్టేందుకే విగ్రహాలు ఆవిష్కరణ చేశామని చెప్పారు. 2009లో ఇదేరోజు తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైందన్నారు. ఆరు దశాబ్దాల ప్రజల ఆకాంక్షలను కాంగ్రెస్​ ప్రభుత్వం నెరవేర్చిందని చెప్పుకొచ్చారు. సోనియా గాంధీ ఎన్నో అడ్డంకులు అధిగమించి మరీ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారని గుర్తు చేశారు. తాము అమలు చేసే పథకాలు, కార్యక్రమాల్లో సోనియా, మన్మోహన్​ స్ఫూర్తి కొనసాగుతోందని ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి చెప్పారు.

Tags

Next Story