TG: తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధం..!

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. న్నికల షెడ్యూల్ ప్రకటనకు ముందే రాజకీయ పార్టీలు వ్యూహాలకు పదును పెట్టుకుంటుండగా, ఎన్నికల సంఘం ఏర్పాట్లు ముమ్మరం చేసింది. అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలు, మౌలిక వసతుల స్థితి, స్థానిక సమస్యలే ప్రధాన అజెండాగా మారనున్న నేపథ్యంలో, అధికార పార్టీ తన పాలనా విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుండగా, ప్రతిపక్షాలు ప్రభుత్వ లోపాలు ఎత్తిచూపేందుకు సిద్ధమవుతున్నాయి. మరోవైపు ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను ఎన్నికల సంఘం వేగవంతం చేస్తుండటంతో, పట్టణ రాజకీయ వాతావరణం క్రమంగా వేడెక్కుతోంది. పట్టణ పాలనపై ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించే ఈ పోరు, అధికార–ప్రతిపక్షాలకు ప్రతిష్ఠాత్మకంగా మారనుంది.
ఫిబ్రవరిలోనే...
2026 ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే గ్రామ పంచాయతీ ఎన్నికలను పూర్తి చేసిన ప్రభుత్వం, ఇప్పుడు మున్సిపాలిటీలు , మున్సిపల్ కార్పొరేషన్లలో ఎన్నికలు నిర్వహించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఫిబ్రవరి మొదటి వారంలోనే ఈ ఎన్నికల ప్రక్రియను ప్రారంభించి ఆ నెలాఖరులోగా పూర్తి చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. రాష్ట్రంలోని మెజారిటీ మున్సిపాలిటీల గడువు 2025 జనవరి 26తో ముగిసింది. పాత పాలక వర్గాల గడువు ముగిసిన వెంటనే ప్రత్యేక అధికారుల పాలన విధించారు. ఇప్పటికే ఏడాది అవుతున్నందున సాధ్యమైనంత త్వరగా ప్రజాస్వామ్య పద్ధతిలో కొత్త పాలక మండళ్లను ఎన్నుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా రూపకల్పన, వార్డుల వారీగా విభజన ప్రక్రియపై ఇప్పటికే దృష్టి సారించింది. మున్సిపల్ ఎన్నికలకు ప్రధాన అడ్డంకిగా మారిన బీసీ రిజర్వేషన్ల అంశంపై ప్రభుత్వం ఎటూ తేల్చుకోలేకపోతోంది. కోర్టులో ఉన్నందున అధికారికంగా రిజర్వేషన్లు ఇవ్వడం సాధ్యం కాదు కాబట్టి.. పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్లాలనుకుంటున్నారు. జనవరి మధ్యలో సంక్రాంతి పండగ ముగిసిన వెంటనే మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఫిబ్రవరిలో మూడు విడతల్లో పోలింగ్ నిర్వహించేలా ఎన్నికల సంఘం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మార్చిలో విద్యార్థులకు వార్షిక పరీక్షలు ఉంటాయన్న ఉద్దేశంతో, ఫిబ్రవరి నెలాఖరుకల్లా ఎన్నికల ప్రక్రియను క్లోజ్ చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది.
కాంగ్రెస్ కు అగ్ని పరీక్ష
ఈ మున్సిపల్ ఎన్నికలు అధికార కాంగ్రెస్ పార్టీకి అగ్నిపరీక్షగా మారనున్నాయి. గ్రామాల్లో తాము పట్టు నిరూపించుకున్నామని కాంగ్రెస్ భావిస్తోంది. పట్టణాల్లోనూ తమదే పట్టు అని అనుకుంటున్నారు. బీఆర్ఎస్ , బీజేపీ తమ సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

