TG: తెలంగాణలో మరో రెండు ఉప ఎన్నికలు.!

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీ హైదరాబాద్ పరిధి మాత్రం చేతికి చిక్కలేదు. ఇక్కడ గత ఎన్నికల్లో ఒక్కరంటే ఒక్క అభ్యర్థి కూడా విజయం సాధించలేకపోయారు. ఉప ఎన్నిక రూపంలో వచ్చిన అవకాశాన్ని కాంగ్రెస్ ఉపయోగించుకుంది. కంటోన్మెంట్లో మొదట విజయం సాధించింది. ఇప్పుడు జూబ్లీహిల్స్‌లో కూడా విజయం సాధించింది. ఇదే క్రమంలో మిగతా ప్రాంతాల్లో పట్టుకోసం ప్రయత్నిస్తోంది. దీని కోసం ఇప్పటికే స్కెచ్ వేసింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా మంది నాయకులు హస్తం గూటికి చేరుకున్నారు. వారిలో ఎమ్మెల్యేలు ఉన్నారు. వారంతా బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. ఒక పార్టీలో గెలిచి అధికార పార్టీలోకి వెళ్లిన వారిపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ పోరాటం చేస్తోంది. ఈ విషయంలో సుప్రీంకోర్టు విచారిస్తోంది. ఇప్పుడు ఈ కేసును తమకు అనుకూలంగా మార్చుకోవాలని ప్రభుత్వం భావించే అవకాశం ఉంది. జూబ్లీహిల్స్ జోష్‌ను కంటిన్యూ చేస్తూ మరిన్ని ఉపఎన్నికలు ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యే వ్యూహం రచించే ఛాన్స్ ఉందంటున్నారు విశ్లేషకులు.
ఆ రెండు పక్కా..?
బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్ (ఖైరతాబాద్), కడియం శ్రీహరి (ఘన్పూర్ స్టేషన్)లపై త్వరలో స్పీకర్ వేటు వేసే అవకాశం ఉందని, దీంతో ఈ రెండు నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు అనివార్యం కావచ్చని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా గెలిచి, ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరిన పలువురిపై స్పీకర్ కార్యాలయంలో విచారణ జరుగుతోంది. ఈ విచారణలో దానం నాగేందర్, కడియం శ్రీహరిల వ్యవహారం కీలక ఘట్టానికి చేరుకుంది. దానం నాగేందర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉంటూనే లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా కాంగ్రెస్ అభ్యర్థిగా సికింద్రాబాద్ ఎంపీ స్థానానికి పోటీ చేశారు. ఈ చర్య ద్వారా ఆయన పార్టీ మారినట్లు స్పష్టంగా రుజువైంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని 24 వేలకు పైగా మెజార్టీతో గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ, ఈ రెండు స్థానాల్లో ఉప ఎన్నికలు వస్తే గెలుపుపై అత్యంత ధీమాతో ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

